- ఎమ్మెల్యే స్వగ్రామంలో గ్రామ పెద్దల నిర్ణయం...
- గ్రామానికి నూతన సర్పంచ్ రూ.కోటి విరాళం
ప్రజాశక్తి - కందుకూరు (ప్రకాశం జిల్లా) : పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రామాల్లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సొంత ఊరు వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ని టాస్ (బొమ్మ, బొరుసు) నిర్ణయించింది. వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వగ్రామం. కొన్ని రోజుల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి ఒసి జనరల్ అయ్యింది. ఈ గ్రామంలో ఎక్కువమంది ఆర్థికంగా స్థిరపడిన వారుండటంతో సర్పంచ్ పదవికి నేనంటే నేనని పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఒకరికి ఇవ్వడానికి అంగీకరించాలని ఎమ్మెల్యే, గ్రామంలోని ముఖ్యులు సూచించారు. సర్పంచ్ పదవిని ఆశిస్తున్న వారిలో ఎమ్మెల్యేకు ఒకప్పటి వ్యాపార భాగస్వామిగా ఉన్న నల్లూరి వెంకట నరసింహ, బడేవారిపాలెం రేషన్ షాపు డీలర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన తాటికొండ సింహాద్రి కుమారుడు సురేష్ ఉన్నారు. వీరిద్దరూ హైదరాబాదులో వ్యాపారాలు చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు. బడేవారిపాలెం టిడిపిలో చీలిక రాకుండా ఉండడానికి ఎమ్మెల్యే, గ్రామ పెద్దల ప్రయత్నాలు సమావేశంలో ఒక కొలిక్కి రాలేదు. సర్పంచ్‌గా పోటీ చేసే వ్యక్తి గ్రామ అభివృద్ధికి కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినా పోటీ తగ్గకపోవడంతో బొమ్మ బొరుసు (టాస్) వేయడం ద్వారా అభ్యర్థిని ఎంపిక చేసేందుకు నిర్ణయించారు. గతంలో సర్పంచ్‌గా (2016- 2021 మధ్యలో) ఎమ్మెల్యే సతీమణి ఇంటూరి సౌజన్య గెలుపొందారు.








కామెంట్‌లు (0)