బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వణికిన ఉత్తరాంధ్ర...

1 గంట క్రితం

వణికిన ఉత్తరాంధ్ర image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 12:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- ఎడతెరిపి లేకుండా వర్షాలు

- రాష్ట్రమంతటా వానలు

- వీడని తీవ్ర వాయు‘గుండం’

ప్రజాశక్తి- యంత్రాంగం : బంగాళాఖాతంంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను బుధవారం వణికించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. నదుల్లో నీటి ఉధృతి పెరిగింది. పలు ప్రాంతాల్లో కొండవాగులు, కాజ్‌‌వేలు పొంగిపొర్లడం, పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వజ్రపుకొత్తూరులో అత్యధికంగా 88.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో నీటి ఉధృతి పెరిగింది. కవిటి మండలంలోని బీల భూముల్లో సుమారు 295 ఎకరాలు నీటమునిగాయి. సంతబొమ్మాళి మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు వరద నీటి ముంపునకు గురయ్యాయి. నందిగాం మండలం కొత్త అగ్రహారం రహదారిలో వంశధార కాలువపై ఉన్న వంతెన కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ అటువైపు రాకపోకలు సాగించకపోవడంతో ప్రమాదం తప్పింది. కంచిలి మండలం బూరగాంలో పూరిల్లు నేలకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

​అల్లూరి జిల్లాలో పలుచోట్ల స్తంభించిన రాకపోకలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ ఉరిసింగిలో చెట్టు రోడ్డుపై కూలిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. వర్షాల కురుస్తుండటంతో డుంబ్రిగుడ మండలం చాపరాయి జలపాతంలో పర్యాటకుల ప్రవేశాలను నిలిపివేశారు. అనంతగిరి మండలం తైడా ఘాట్ రోడ్డులో చెట్లు కూలిపోయాయి. డముకు వారపు సంతకు వచ్చిన గిరిజనులు తిరుగు ప్రయాణంలో గెడ్డను దాటేందుకు అవస్థలు పడ్డారు. కాశీపట్నం గ్రామంలో భారీ చింతచెట్టు అనంతగిరి-అరకు ప్రధాన రహదారిపై విరిగిపడింది. జికె.వీధి మండలం ధారకొండ పంచాయతీ చిన్న గంగవరం తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో 15 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. గాలికొండ పంచాయతీ బత్తునూరు వాగు తీవ్ర రూపం దాల్చడంతో గిరిజనుల రాకపోకలు స్తంభించిపోయాయి. పోలవరం జిల్లా విఆర్.పురం మండలంలో కుండపోత వర్షాలకు తొస్టివారిగూడెం వంతెనపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటి హోరుకు అన్నవరం–ఉమ్మడివరం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి పూర్తిగా మునిగిపోవడంతో దాదాపు మూడు గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయి ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.​ రాజవొమ్మంగి మండలం బడదనాంపల్లి పంచాయతీ పరిధి అమ్మిరేకుల, కొత్తవీధి గ్రామాల మధ్య రహదారిపై వంద ఏళ్ల నాటి భారీ చింతచెట్టు రహదారి మధ్యలో కూలిపోవడంతో గంటల కొద్దీ వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి.

భారీ చెట్టు కూలి విరిగిన పాఠశాల ప్రహరీ

విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం చిన్నాపురం ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్న భారీ చెట్టు కూలడంతో ప్రహరీ విరిగిపోయింది. పాఠశాలకు ముందుగానే సెలవు ప్రకటించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పద్మనాభం మండలం పాండ్రంగి వద్ద గోస్తనీ నది కాజ్‌‌వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలను నియంత్రించారు. తునిపాలెం పల్లెగెడ్డపై రహదారిని ముందు జాగ్రత్తగా అధికారులు మూసేశారు. విశాఖ నగరంలోనూ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. నాగావళి, జంఝావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాలకొండ-హడ్డుబంగి

సీతంపేట మండలం దేవనపురం-పెద్దారం ప్రధాన రహదారిపై భారీ వృక్షం పోవడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చంద్రంపేట వద్ద గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు ఆ గ్రామానికి రాకపోకలను నిలిపివేశారు. తీర ప్రాంతమైన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి.

ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలం

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు బీచ్ రోడ్డుపైకి వస్తున్నాయి. దీంతో, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో భారీ వర్షానికి అరటి తోటల్లోకి నీరు చేరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, రాజానగరం, ఉండ్రాజవరం, తాళ్లపూడి మండలాల్లో సాయంత్రం నుంచి వర్షం జోరందుకుంది. కర్నూలు జిల్లాలో తుగ్గలి, పత్తికొండ, హోళగుందలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. గుంటూరు జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కృష్ణా, ఎన్‌‌టిఆర్‌, ప్రకాశం, తిరుపతి, కడప, అన్నమయ్య, జిల్లాల్లో చెదురు మదురు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని పలు మండలాల్లో అక్కడక్కడా కొద్దిపాటి వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో అక్కడకక్కడా చిరు జల్లులు పడ్డాయి.

నేడు పశ్చిమగోదావరి జిల్లాల్లో పాఠశాలకు సెలవు

పశ్చిమగోదావరి జిల్లాల్లో గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. వర్షాలు లేక అల్లాడిపోతున్న రైతాంగానికి ముసురుతో సంతోషమొచ్చింది. బీటలు వారుతున్న వరి పొలాలకు ఊరట లభించింది.

​ ‘బాహుబలి’ తరహాలో పిల్లాడితో కలిసి వాగు దాటిన తండ్రి

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం ఓనుకొండ గ్రామంలో బాహుబలి సినిమాలో ఓ సన్నివేశం గుర్తుకొచ్చేలా ఘటన చోటుచేసుకుంది. ఎగువ ప్రాంతాలైన అనంతగిరి, వేంగడ, వాలసీ, లుంగపర్తి మీదుగా రైవాడ జలశయానికి వస్తున్న వర్షపు నీటితో గోస్తని గెడ్డ ఉప్పొంగి ప్రవహించింది. ఓనుకొండ, మలుంగుమ్మి, ఎర్రమెట్టు చుట్టుప్రక్కల గ్రామాల గిరిజనులు నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు ఈ గెడ్డను దాటి వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో వరద ఉధృతి ఎక్కువైంది. దీంతో, ఓనుకొండ గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు తన కుమారుడిని భుజంపై వేసుకొని ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును పీక లోతుల్లో

నీటిలో దాటారు. కొండపైకి మట్టి రోడ్డు ఉన్నప్పటికీ కనీస వంతెన నిర్మించకపోవడంతోనే గిరిజనులకు వర్షాకాలంలో ఇటువంటి ప్రమాద భరిత ప్రయాణాలు తప్పడంలేదు. అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని వాగును దాటాల్సి వస్తోంది. ఇప్పటికైనా టిడిపి కూటమి ప్రభుత్వం వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.

నేడూ భారీ వర్షాలు : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో గురువారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదుతోందని, బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కళింగపట్నానికి 30 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 90 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది బుధవారం అర్ధరాత్రి సమయంలో విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.

తీవ్రవాయుగుండం తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు మరో 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు , హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సహాయక చర్యల కోసం శ్రీకాకుళంలో మూడు, అల్లూరి రెండు, విశాఖ రెండు, పోలవరం ఒకటి, అనకాపల్లిలో ఒకటి... మొత్తం ఐదు ఎస్డీఆర్ఎఫ్, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత జిల్లాల్లో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు సమాచారం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్