- టిడిపి మాజీఎమ్మెల్సీ అశోక్ బాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పట్టణాల్లో తమకు 94శాతం విజయం దక్కినట్లే శనివారం వెలువడే జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఫలితాల్లోనూ గ్రామీణ ప్రజలు కూటమికి చారిత్రక విజయాన్ని అందించి తీరబోతున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్సీ పి అశోక్ బాబు అన్నారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పంచాయతీ రాజ్ వ్యవస్థలు పూర్తిగా సర్వనాశనమయ్యాయని పేర్కొన్నారు. ఆ ఆక్రోశం, ఆవేదనతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసిపిపై తిరగబడి కూటమికి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు.
త్వరలోనే పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయని పేర్కొన్నారు. జెడ్‌పిటిసి, ఎంపిటిసి, పంచాయతీ ఎన్నికలే గ్రామీణ ప్రజల నాడిని, వారి నిజమైన అభిప్రాయాలను స్పష్టంగా ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఈ ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే తరహా చారిత్రక తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పూర్తిగా గ్రహణం పట్టిందని, పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు గాలికొదిలేశారని ఆరోపించారు. కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు నేరుగా కేటాయించిన దాదాపు రూ.12,000 కోట్ల నిధులను జగన్ ప్రభుత్వం దొడ్డిదారిన దారిమళ్లించి పప్పుబెల్లాల్లా ఖర్చు చేసిందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక తాము అరాచకం చేశామని ఎన్నికల సంఘానికి 74 ఫిర్యాదులు ఇవ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్వహించారని, జగన్ మాత్రం ప్రతి బూత్, ప్రతి మున్సిపాలిటీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసిల్లో గొడవలు సృష్టించే కుసంస్కృతిని తీసుకొచ్చారని ఆరోపించారు.2019 ఎన్నికలకు ముందు ఏ అబద్ధపు ప్రచారాలనైతే ఎంచుకున్నారో, ఇప్పటికీ జగన్ అదే పంథాను కొనసాగిస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మరో సమావేశంలో ఆరోపించారు.
తన పాలన సువర్ణయుగం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని జగన్ పదేపదే చెప్పుకోవడం ఆయన రాజకీయ అజ్ఞానానికి, మానసిక స్థితికి నిదర్శనమని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)