- 365 లెక్కింపు కేంద్రాల ఏర్పాటు
- 19,885 మంది పోలీసులతో భద్రత
- రాష్ట్ర ఎన్నికల సంఘం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును శనివారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 365 లెక్కింపు కేంద్రాల్లో సుమారు 9,062 లెక్కింపు బల్లలపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం 11,002 మంది లెక్కింపు పర్యవేక్షకులు, 28,692 మంది లెక్కింపు సహాయకులు, ఇతర సిబ్బందిని నియమించారని తెలిపారు. ఓట్ల లెక్కింపులో తొలుత పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం బ్యాలెట్ పెట్టెల్లోని ఎంపిటిసి, జడ్‌పిటిసి బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారని తెలిపారు. మొత్తం లెక్కింపు బల్లల్లో 50 శాతం జడ్‌పిటిసి, మిగిలిన 50 శాతం ఎంపిటిసి స్థానాలకు కేటాయించారని, ప్రతి బల్లకు ఒక్కో రౌండ్‌లో వెయ్యి బ్యాలెట్ పత్రాలను లెక్కింపు కోసం అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో పటిష్టమైన పోలీసు భద్రత, సిసిటివి నిఘా ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసిమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఐజి బి. రాజకుమారి వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాల్లో 19,885 మంది పోలీసు సిబ్బందితో మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సిసిటివి కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్‌తో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీ వోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)