- ఆదాయానికి మించి రూ.5 కోట్ల ఆస్తులు గుర్తింపు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చర్యలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేసిన అధికారులు కార్యాలయానికి తరలించారు. నేడు నెల్లూరు ఏసీబీ కోర్టులో లోకనాథంను హాజరుపరచనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ప్రారంభమైన ఏసీబీ సోదాలు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. లోకనాథం నివాసం, కార్యాలయాలతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రెండు కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లోకనాథం, ఆయన కుమారుడి పేర్లపై ఉన్న నాలుగు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, తిరుపతి శ్రీనివాసనగర్‌లో ఫ్లాట్, గొల్లవానిగుంటలో రెండు ఇళ్లు, వడమాలపేట మండలం పాదిరేడులో మరో ఇల్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కల్తీ నెయ్యి కేసులో మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నఅప్పన్న విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా లోకనాథంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం గుర్తించిన ఆస్తులు, నగదు, బంగారం, వెండి విలువను అధికారులు లెక్కిస్తున్నారు. వాటికి సంబంధించిన ఆదాయ వనరులు, ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన నిధులపై దర్యాప్తు కొనసాగుతోంది. సోదాల్లో బయటపడిన ఆస్తుల్లో ఎన్ని చట్టబద్ధమైనవో, మరెన్ని ఆదాయానికి మించినవో తేల్చే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు.







కామెంట్‌లు (0)