బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముంపులోనే గ్రామాలు, పంటలు..

1 గంట క్రితం

editedimage-1793811618522-3891_resized.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 12:16 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • పొంగిప్రవహిస్తున్న వాగులు, వంకలు

  • పెదవాగు ప్రాజెక్టు రింగ్‌బండ్‌కు గండి

  • జలదిగ్బంధంలో గ్రామాలు

  • చంద్రబాబుకు మోడీ ఫోన్

  • అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంపై ఆరా

  • గుండెపోటుతో గొర్రెల కాపరి మృతి

ప్రజాశక్తి- యంత్రాంగం : మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గ్రామాలు, పంటలు నీటిలోనే నానుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిల్చిపోయాయి. వరద వల్ల ఆందోళనకు గురై చీరాలకు చెందిన గొర్రెల కాపరి ఎం.వెంకటేశ్వరరావు (59) మృతి చెందారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో మేకలను కాస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుపాన్ల తాకిడి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోడీ బుధవారం ఫోన్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లిందని, రహదారులు, విద్యుత్తు సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ప్రధాని దృష్టికి సిఎం తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తగిన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. తుపాను సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందంటూ, నిరంతర అప్రమత్తతతో ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారంటూ ముఖ్యమంత్రిని ప్రధాని ప్రశంసించారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చిన గంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా గగనతలం నుంచి వీక్షించారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల నాటికి ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో అత్యధికంగా 182.5 మిల్లీమీటర్లు, జీలుగుమిల్లిలో 139.63 మిల్లీ మీటర్లు, పి.నారాయణపురంలో 128.75 మిల్లీ మీటర్లు, కాకినాడ జిల్లా ఆర్యవటంలో 126.25 మిల్లీ మీటర్లు, పెదపూడిలో 123.69 మిల్లీ మీటర్లు, ఏలూరు జిల్లా నూతిరామన్నపాలెంలో 122.0 మిల్లీ మీటర్లు, కాకినాడ జిల్లా కాజులూరులో 121.08 మిల్లీ మీటర్లు, కరపలో 120.25 మిల్లీ మీటర్లు, వేళంగిలో 114.01 మిల్లీ మీటర్లు, జి.మామిడలో 112.75 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను ముంచెత్తిన వరద

తెలంగాణలోని గుమ్మడివల్లి వద్ద పెద్దవాగు ప్రాజెక్టు నీటిని మూడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు రింగ్‌బండకు బుధవారం గండపడడంతో ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. మేడిపల్లి - వేలేరుపాడు, గుళ్లవాయి -వసంతవాడ, వేలేరుపాడు - రుద్రంకోట, వేలేరుపాడు - కోయిదా రహదారులు జలమయ్యాయి. సుమారు 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. 2024లో జులై 18న ఈ ప్రాజెక్టు వరద నీరు ముంచెత్తడంతో అప్పట్లో దాదాపు 20పైగా గ్రామాలు కట్టుబట్టలతో మిగిలారు. మళ్లీ ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుట్టాయగూడెం మండలంలోని కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో, 365 బిబి జాతీయ రహదారి కొన్నిచోట్ల దెబ్బతింది. బుట్టాయగూడెంలోని మండల పరిషత్, తహశీల్దార్, ఐసిడిఎస్ కార్యాలయం, విద్యుత్ సబ్‌ ‌స్టేషన్ ప్రాంగణాలు వర్షపు నీటితో నిండిపోయాయి. పోలవరం మండలలోనూ రోడ్లు, పంట పొలాలు నీటి ముంపులోనే ఉన్నాయి.

ముంపులోనే గ్రామాలు, పంటలు image 1
రెండు రోజులుగా అంధకారంలోనే ఒంగోలు

ప్రకాశం జిల్లా ఒంగోలు అంధకారంలోనే ఉంది. 18 కాలనీల్లో విద్యుత్తు సరఫరా నిల్చిపోయింది. ఉప్పుఉండేరు నాగన్నవాగు పొంగి ప్రవహిండడంతో వరద నీరు రోడ్లను ముంచెత్తింది. నాగులుప్పలపాడులో విద్యుత్తు సరఫరాకు మరో రెండు రోజులు పడుతుందని విద్యుత్తు శాఖ ఎఇ సత్యనారాయణ తెలిపారు.

వేలాది ఎకరాల్లో పంటలు మునక

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడంతో ప్రత్తిపాడు, తాడికొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పంట కాలువలకు గండ్లు పడడంతో పంట పొలాల్లో నాలుగు అడుగుల మేర నీరు చేయడంతో 40 వేల ఎకరాల్లో పత్తి, 20 వేల ఎకరాల్లో మిర్చి, 30 వేల ఎకరాలు వరి, పది వేల ఎకరాల్లో ఇతర పంటలు నీట మునిగి పంట ఎందుకు పనికి రాకుండా పోయాయి. నల్లమడ డ్రెయిన్ కు నాలుగు చోట్ల గండిపడి పెదనందిపాడు, చిలకలూరిపేట, కాకుమాను, వట్టిచెరకూరు తదితర మండలాల్లోని దాదాపు 30 గ్రామాల్లో పొలాలను వరద నీరు ముంచెత్తింది. పెదనందిపాడు, గార్లపాడు, నాగులు పాడు వద్ద డ్రెయిన్ కు గండ్లు పడ్డాయి. ఇంకా 23 గ్రామాలకు విద్యుత్తు పునరుద్ధరణ జరగలేదు. రాజధానిలోని విట్, ఎస్‌ఆర్‌ఎం, ఐఎఎస్, ఐపిఎస్ భవన సముదాయాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ భవనాల తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కొండవీటి వాగు, కోటేళ్ల వాగు పొంగడంతో పలు ప్రాంతాల్లో నీరు చేరింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు-ఇందుపల్లి గ్రామాల మధ్య బుడమేరు ఉధృతంగా ప్రవహించడంతో లోలెవల్‌ వంతెనపై మీటరు మేర వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి.
అల్పపీడనంతో నేడు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్‌‌పై ఉన్న అల్పపీడనం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ.. మరింత బలహీనపడి అల్పపీడనంగా బుధవారం మారనుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారంనాడు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రఖర్‌ ‌జైన్‌ ‌బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్