గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

6 న ‘ఆశా డే’ కార్యక్రమాన్ని బహిష్కరిస్తాం

1 గంట క్రితం

chituru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 03:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -చిత్తూరు: ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 6న నిర్వహించనున్న ఆశా డే కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోనూ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం డీఎంహెచ్‌ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బలక్ష్మి, గంగ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తూ వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లపై పని భారం పెంచడం, వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. లెప్రసీ సర్వేలో ఓటీపీ విధానాన్ని రద్దు చేసి, వేతనాలు పెంచడంతోపాటు పని భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

జిల్లాలో డీఎంహెచ్‌ఓ ఆదేశాలను సైతం కొందరు మెడికల్‌ ఆఫీసర్లు పట్టించుకోకుండా ఆశా వర్కర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఓపీ డ్యూటీలు వేయరాదని ఆదేశాలు ఉన్నప్పటికీ కొలమాసినపల్లి, తీర్థం తదితర పీహెచ్‌సీల్లో ఆశాలకు ఓపీ డ్యూటీలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. తమ విధుల్లో భాగం కాదని చెబితే మెమోలు ఇస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. తవణంపల్లి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ ఆశా యూనియన్‌ నాయకురాలిని ప్రజల సమక్షంలో బెదిరించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌ఓలకు సంబంధించిన పనులను కూడా ఆశా వర్కర్లతో చేయిస్తున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం కొందరు మెడికల్‌ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వీకోట మండలంలో అధికారుల వేధింపులతో ఆశా వర్కర్‌ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా విచారణ నివేదికను జిల్లా అధికారులకు అందజేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆశా డే కార్యక్రమాన్నే కాకుండా తదుపరి అన్ని కార్యక్రమాలను బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కోశాధికారి సావిత్రి, జిల్లా నాయకులు వనజ, నళిని తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్