- తేల్చి చెప్పిన ప్రభావిత గ్రామాల ప్రజలు
- బిడిమిలో గ్రామస్తులతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశం
- రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని విడనాడాలి: సిపిఎం రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : పచ్చని ఉద్దానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్‌పోర్టుకు భూములిచ్చేది లేదని ప్రభావిత గ్రామాల ప్రజలు, రైతులు తేల్చి చెప్పారు. మందస మండలం బిడిమిలో బిడిమి, పాత బిడిమి, రాంపురం, బేతాళపురం, లక్ష్మీపురం తదితర గ్రామాల ప్రజలు, రైతులతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం సమావేశం నిర్వహించారు. తొలుత టిడిపికి చెందిన జుత్తు లోకనాథం మాట్లాడేందుకు ప్రయత్నించగా, సెంటు భూమి లేని వ్యక్తులు తమ భూముల కోసం మాట్లాడటమేమిటని గ్రామస్తులు నిలదీశారు. తర్వాత మందస మండల టిడిపి అధ్యక్షుడు దుర్యోధన మాట్లాడుతుండగా ఎయిర్‌పోర్టు ప్రభావిత గ్రామాలకు సంబంధం లేని వ్యక్తి ఎలా మాట్లాడుతారంటూ లేచి వెళ్లిపోయేందుకు మరోసారి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఎవరూ వెళ్లిపోవద్దని, అభిప్రాయాలు చెప్పాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. దీంతో కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు, నాయకులు జుత్తు భూపతి మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు కోసం భూములు తీసుకుంటే, భూములను నమ్ముకున్న రైతుల బతుకులు నాశనమవుతాయని, ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ‘ఉడాన్’ పథకం కింద ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నామని, ప్రైవేట్‌కి కట్టబెడతారనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఎయిర్‌పోర్టు కోసం సేకరించే భూముల్లో 500 ఎకరాల్లో పరిశ్రమలు వస్తాయని, తద్వారా వచ్చే ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రసంగం పూర్తయిన తర్వాత ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమావేశానికి హాజరైన పలు గ్రామాల ప్రజలు రామ్మోహన్ నాయుడికి తీర్మానాలు అందించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓంపాండియా, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు.
పలువురు గృహ నిర్బంధం
ప్రజలకు మద్దతుగా బిడిమి సమావేశానికి వెళ్తారనే సమాచారంతో వామపక్ష నాయకులు, కార్గో వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావును శ్రీకాకుళంలో ఆయన ఇంటి వద్ద నిర్బంధించారు. వామపక్ష నాయకులు చాపర వెంకటరమణ, వంకల మాధవరావు, తామాడ సన్యాసిరావు, ఎన్.గణపతి, జోగి అప్పారావును గృహ నిర్బంధం చేశారు. కార్గో వ్యతిరేక పోరాట కమిటీ మీడియా వింగ్ కన్వీనర్ బత్తిన లక్ష్మణ్‌ను మందస పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బిడిమి వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఆధార్ చూపిన వారినే అనుమతించారు. అక్రమ అరెస్టులను వామపక్ష నాయకులు భవిరి కృష్ణమూర్తి, తాండ్ర ప్రకాష్ తదితరులు ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని విడనాడాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ
రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని విడనాడాలని, శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు ప్రభావిత గ్రామంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్‌నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావును గత రాత్రి నుంచి పోలీసులు గృహ నిర్బంధంలో వుంచడం గర్హనీయమని పార్టీ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు బత్తిన లక్ష్మణరావును కూడా ఆదివారం ఉదయం అరెస్టు చేసి మందస పోలీస్టేషన్‌కు తరలించారని పేర్కొన్నారు. వామపక్ష పార్టీల నాయకులు వంకల మాధవరావు, తామాడ సన్యాసిరావు, చాపర వెంకట రమణ, ఎన్ గణపతి ఇళ్ళ వద్దకు పోలీసులు వెళ్ళి ఆదివారం ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు గ్రామాలకు వెళ్ళరాదని హెచ్చరించారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పాల్గొంటున్నారు గనుక ఆ ప్రాంతానికి వచ్చే వారందరి ఆధార్ కార్డులను తనిఖీ చేసి ఇరుగు పొరుగు మండలాల వారిని అనుమతించడం లేదని వివరించారు. ఎయిర్‌పోర్టు ప్రభావిత రైతులతోనూ, ఆయా గ్రామస్తులతోనూ ప్రభుత్వం ప్రజాస్వామికంగా చర్చించాల్సిందిపోయి ఇలా నిర్బంధ చర్యలకు పాల్పడడం తగదన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి బలవంతపు భూసేకరణ ఆపాలని, గోవిందరావును గృహ నిర్బంధం నుంచి, మిగతా వారిని ఆయా పోలీస్ స్టేషన్ల నుంచి విడుదల చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)