- సకాలంలో స్పందించడంతో తప్పిన విషాదం
ప్రజాశక్తి- ఆమదాలవలస : కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో ఆందోళనలో ఉన్న ఓ ప్రేమజంటను శక్తి టీమ్-2 పోలీసులు బుధవారం సకాలంలో గుర్తించి కాపాడారు. పట్టణంలోని మార్కెట్‌లో యువజంట అనుమానాస్పదంగా ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని అమ్మాజీ, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణరావు అక్కడికి చేరుకుని వారిని విచారించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన గజపతి జిల్లా కెరడాసింగి గ్రామానికి చెందిన జూబ్లీ నబర్‌గా యువతిని గుర్తించారు. కొత్తూరు మండలం రాయల గ్రామ సమీపంలోని కొత్తగూడ ప్రాంతానికి చెందిన అమర్నాథ్‌గా యువకుడిని పోలీసులు గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిఐ ఎం.సన్యాసినాయుడు, ఎస్‌ఐ సనపల బాలరాజులకు సమాచారం అందించారు. అనంతరం యువ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులను పిలిపించి యువజంటను సురక్షితంగా అప్పగించారు. సమస్యలకు ఆత్మహాత్య పరిష్కారం కాదని ఇబ్బందులు ఎదురైతే పోలీసులను సంప్రదించాలని శక్తి టీమ్ సూచించింది.








కామెంట్‌లు (0)