ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత వేటు విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి, జస్టిస్ మోహనతో కూడిన ధర్మాసనం గురువారం పిటిషన్‌ను విచారించి హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరఫున పోటీ చేయడాన్ని తప్పుబట్టింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని పేర్కొంది. దానం నాగేందర్ తరుపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మరో పార్టీ నుంచి లోక్‌సభకు పోటీచేయకూడదని రాజ్యాంగపర నిషేధమేదీ లేదన్నారు. గతంలో ఇలా వేరే పార్టీ నుంచి పోటీచేశారన్న కారణంతో బీహార్‌కు చెందిన మహాచంద్రప్రసాద్‌ను సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిందన్న ఏకైక కారణాన్ని ప్రాతిపదికగా తీసుకొని స్పీకర్ ఆదేశాలను హైకోర్టు కొట్టేయడం పొరపాటు అని వాదించారు. సుప్రీం తీర్పు అనంతరం దానం నాగేందర్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజాక్షేత్రంలో తనకు బలముందని చెప్పారు.
దానం నాగేందర్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ
24 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)