ప్రజాశక్తి-అమరావతి : రాజధాని అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి వ్యాజ్యాలు ఇంకా ఏమైనా ఉంటే వాటి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. వ్యాజ్యాలను అంశాలవారీ వర్గీకరిస్తే విచారణ సులువవుతుందని తెలిపింది. అమరావతే ఏకైక రాజధాని అంటూ 2022 మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు ఈ నెల 29న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుత వ్యాజ్యాల విచారణను వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ ఎన్ జయసూర్య, జస్టిస్ బిఎస్ భానుమతితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన సిఆర్డిఎ చట్టం రద్దు, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానుల) చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులు, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు 2022 మార్చి 3న అమరావతే ఏకైక రాజధాని అంటూ తీర్పు ఇచ్చింది. రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింతకు గడువులు విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి హైకోర్టు విధించిన గడువులపై స్టే విధించింది. శుక్రవారం విచారణలో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది మురళీధరరావు వాదిస్తూ.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇంకా ఇవ్వలేదని, వాటిని నిర్దిష్ట గడువులోగా అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అయితే సుప్రీంకోర్టులో అప్పీళ్లు పెండింగ్లో ఉన్నందున కాలపరిమితులు విధిస్తూ ఆదేశాలివ్వలేమని ధర్మాసనం తెలిపింది. న్యాయవాది డిఎస్ఎన్వి ప్రసాద్బాబు అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అప్పీళ్లను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరగా, కెఎస్ మూర్తి తమ వ్యాజ్యాల్లో చాలా వరకు నిరర్థకమయ్యాయని తెలిపారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. రాజధాని ప్రాంతంలో పనులు కొనసాగుతున్నాయని, మూడేళ్లలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ నెల 29న అప్పీళ్లు విచారణకు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ టెంటేటివ్ లిస్టులో ఉన్నట్లు న్యాయవాదులు, అడ్వకేట్ జనరల్ చెప్పడంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.








కామెంట్లు (0)