- రాంకీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : సిపిఎం
ప్రజాశక్తి - అనకాపల్లి (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రంలోని పెద్ద చెరువులోకి ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను శుద్ధి చేయకుండా విడుదల చేస్తున్న రాంకీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం డిమాండ్ చేశారు. మొల్లెడిగెడ్డ నుండి సన్యాసి చెరువు మీదుగా ఈ జలాలను వదులున్నారని తెలిపారు. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన నోటీసులను ఆయన స్వాగతించారు. నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనకాపల్లిలోని దొడ్డి రామునాయుడు భవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలైన కాలవలు, చెరువులు, గెడ్డల్లోకి వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేయడంవల్ల భూగర్భజలాలు కాలుష్యమవుతున్నాయని, వర్షం వచ్చినప్పుడు అన్ని ఫార్మా పరిశ్రమల నుండి వచ్చిన వ్యర్థ జలాల వల్ల ఈ ప్రాంత ప్రజలు చర్మ, కిడ్నీ, కేన్సర్, గుండె, ఊపిరితిత్తులు సంబంధించిన జబ్బులకు గురవుతున్నారని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సక్రమమైన పద్ధతుల్లో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా పెద్ద చెరువులో టన్నుల కొద్దీ చేపలు చనిపోయాయని గుర్తుచేశారు. ఈ ప్రాంతంలో ప్రజలు మంచి గాలికి, మంచి నేలకి, మంచినీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మత్స్య సంపద నాశనమై మత్స్యకారుల ఉపాధికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శంకర్రావు, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)