శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హమాలీల కూలి రేట్లపై జాయింట్ మీటింగ్

3 రోజుల క్రితం

హమాలీల కూలి రేట్లపై జాయింట్ మీటింగ్
- పౌరసరఫరాలశాఖ కమిషనర్ హామీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 10:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- పౌరసరఫరాలశాఖ కమిషనర్ హామీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సివిల్ సప్లయీస్ హమాలీల కూలి రేట్ల పెంపు సమస్యపై త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ కె కన్నబాబు హామీ ఇచ్చారు. విజయవాడ ఆటోనగర్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ఎపి పౌరసరఫరాల సంస్థ హమాలీల యూనియన్ నాయకులు సోమవారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2026 జనవరి ఒకటి నుంచి క్వింటాకు రూ.28 నుంచి రూ.40కు కూలి రేట్లు పెంచి, బకాయిలతో సహా చెల్లించాలని కోరారు. కొత్తగా చేరిన హమాలీలకు సిపిఎఫ్ నెంబర్లు కేటాయించాలని, దసరా బోనస్‌, స్వీట్‌ బోనస్‌ అందించాలని కోరారు. ఇఎస్‌ఐ అమలు, గోడౌన్ల మార్పిడితో తగ్గుతున్న ఆదాయాలు, పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కారం, ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. దసరా బోనస్‌ను రూ.6,500 నుంచి రూ.7,000కు, స్వీట్‌కు రూ.1,300 నుంచి రూ.1,500కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు యూనియన్ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. హమాలీలందరికీ ఇఎస్ఐను అమలు చేయాలని, అమలయ్యేలోగా ప్రమాదాలకు గురైన వారికి ప్రభుత్వం వైద్య సేవలు అందించాలన్నారు. మరణించిన వారికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి స్టాక్ పాయింట్ వద్ద హమాలీలపై పెరిగిన పనిభారాన్ని దృష్టిలో ఉంచి రిక్షా వాహనాల సంఖ్య పెంచాలన్నారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ కృష్ణ, ఎస్ ఉదయ భాస్కరరావు, రాష్ట్ర నాయకులు నాగరాజు, ఆంజనేయులు శ్రీను, హనుమంత్ రెడ్డి, నాగేంద్ర, శ్రీకాంత్, శేఖర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్