- సిఐఐ ప్రాంతీయ సదస్సులో యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : వేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి ప్రాంతంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులను రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కోరారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సిఐఐ ప్రాంతీయ సదస్సులో రావత్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. 2030, 2035, 2047 సంవత్సరాలకు సాధించాల్సిన ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు ఉన్నాయని, 46 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, 26 ఎంఎస్ఎంఇలకు 480 ఎకరాలు కేటాయించారని వివరించారు. మచిలీపట్నం పోర్టు అనుసంధానంగా ఉంటుందన్నారు. ప్రకాశం జిల్లాలో బిపిసిఎల్ రిఫైనరీ, దోనేపూడిలో భారత డైనమిక్స్ సంస్థ యూనిట్ రానుందని, పర్యాటక రంగంలో కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ.. హై స్పీడ్ రైళ్లతో పాటు సమీకృత మౌలిక సదుపాయాలు రాబోతున్నాయన్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ మాట్లాడుతూ.. పోర్టులు, షిప్ బిల్డింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ లు రానున్నాయని, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఆర్థిక అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నరేంద్ర కుమార్ శరణం, ఐటిసి అగ్రి బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ గౌరహ, పిఐ డేటా సెంటర్స్ సిఇఒ కల్యాణ్ ముప్పనేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, ఎగుమతులకు ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పెట్టుబడిదారుల మధ్య ఒప్పంద కుదుర్చుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఐటి శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, రవాణా శాఖ కార్యదర్శి కోన శశిధర్, సిఆర్ డిఎ కమిషనర్ విజయ రామరాజు, ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఇడిబి) సిఇఒ షన్ మోహన్, జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)