- వ్యవసాయశాఖ చొరవ అవసరం
- టెలీకాన్ఫరెన్సులో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
భవిష్యత్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు నష్టపోకుండా బీమా రక్షణ కవచంలా నిలిచేలా చూడాలని వ్యవసాయశాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పంటల బీమాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి పంటల బీమాపై వ్యవసాయశాఖ అధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో అర్నబ్, మురసు తుపాన్లు వెంట వెంటనే ప్రభావం చూపినప్పటికీ ఎదుర్కొనేందుకు అన్ని విధాలా చర్యలు చేపట్టామన్నారు. అయితే వ్యవసాయ రంగానికి ఈ తుపాన్ల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి 22 రకాల పంటలను బీమాకు నోటిఫై చేశామని, ఇందులో 15 పంటలకు దిగుబడి ఆధారిత బీమా, మరో 7 పంటలకు వాతావరణ ఆధారిత బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. పంటల బీమా కల్పించడంలో రాష్ట్రం 6వ స్థానంలో ఉందన్నారు. ఈసారి 17.07 లక్షల మంది రైతులు సాగు చేసిన పంటలకు బీమా కల్పించామని, బీమా చేయించిన మొత్తం విస్తీర్ణంలో వరి, కందులు, వేరుశనగ, పత్తి, మిరప, మొక్కజొన్న పంటల వాటా 90 శాతంగా ఉందని వెల్లడించారు. వరి పంట సాగు విస్తీర్ణంలో అధిక భాగం తుపాను ప్రభావిత 16 జిల్లాల్లోనే ఉందన్నారు. క్లస్టర్ల వారీ వివిధ బీమా కంపెనీలకు పంటల బీమా బాధ్యతలను అప్పగిస్తున్నామని తెలిపారు. పంటల దిగుబడి ఆధారంగా బీమా పరిహారం నిర్ణయించే విధానాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 30,286 పంట కోత ప్రయోగాలు చేయాల్సి ఉందన్నారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలన్నింటినీ అగ్రి యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.








కామెంట్‌లు (0)