మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సంబరాల వేళ.. అగ్నిప్రమాదాల కలకలం

15 గంటల క్రితం

fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 10:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- బాణసంచా నిప్పురవ్వలతో ఆస్తి నష్టం

ప్రజాశక్తి - యంత్రాంగం : దీపావళి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి గంగమ్మపేటలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూమ్‌లోకి టపాసులు దూసుకెళ్లడంతో మూడు స్కూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరంలోని పర్నిచర్‌ దుకాణంపై నిప్పురవ్వలు పడడంతో మంటలు చెలరేగాయి. విజయనగరం జిల్లా రాజాంలో టపాసుల నిప్పురవ్వలు పడటంతో ఆటోమొబైల్ షోరూంలో మంటలు చెలరేగి ఇంజిన్ ఆయిల్, విడిభాగాలు సహా రూ.25 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం ఆముదల వలసలో దీపావళి రాకెట్‌ ఆయిల్‌ గోదాములోకి దూసుకువెళ్లడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు గాయపడ్డారు. కెజిహెచ్‌లో 22 మంది చేరగా వారికి సత్వర చికిత్స అందించారు. 20 మందిని డిశ్చార్జ్ చేశారు. ఇద్దరికి ఆస్పత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వారికి ప్రాణాపాయంలేదని వైద్యులు తెలిపారు.

సిఎం విచారం

దీపావళి పండగ సందర్భంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జరిగిన అగ్నిప్రమాదాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దీపావళి సమయంలో బాణాసంచా కాల్చే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్