- వృద్ధునిపై కత్తితో దాడి చేసి హత్య
ప్రజాశక్తి - అంబాజీపేట (డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా): డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో మతిస్థిమితం లేని వ్యక్తి కత్తి పట్టుకుని వీరంగం సృష్టించాడు. ఒక వృద్ధుడిని నరికి హత్య చేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన పిట్ల ప్రసాద్ కొబ్బరికాయలు దింపులు తీస్తూ జీవనం సాగించేవాడు. కొన్ని రోజులుగా ఆయన మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుమారు ఆరు గంటల సమయంలో కొబ్బరి దింపునకు ఉపయోగించే కత్తిని తీసుకుని గ్రామంలో కలియతిరిగాడు. మార్కెట్ సమీపంలోని రామాలయం వద్ద నడిచి వెళ్తున్న మామిడిశెట్టి సత్యనారాయణపై వెనుకనుంచి కత్తితో దాడి చేశాడు. దీంతో సత్యనారాయణ (76) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది గ్రామస్తులు ప్రసాద్‌ను పట్టుకుని స్తంభానికి కట్టేశారు. మృతుని కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ భీమరాజు, ఎస్ఐ సుభాని సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.









కామెంట్‌లు (0)