శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాట్సాప్ పాలనకు ఆదరణ కరువు

1 గంట క్రితం

whatsapp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 11:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఏడాదిన్నరలో 64.23 కోట్ల లావాదేవీల్లో..

వాట్సాప్ ద్వారా జరిగినవి 4.32 కోట్లే!

- కీలకమైన రెవెన్యూ, పురపాలక, ఇంధనశాఖల్లోనూ తక్కువే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సేవలను ప్రజల అరచేతిలోకి తీసుకొస్తామని, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాట్సాప్‌లోనే అన్ని సేవలూ అందిస్తామని ప్రభుత్వం చేసిన ప్రచారం ఆశించిన ఫలితాలను ఇస్తోందా అంటే లేదనే చెప్పాలి. వాట్సాప్ ద్వారా సేవలు కేవలం 6.74 శాతమే జరుగుతున్నాయి. విడతల వారీ ప్రభుత్వం దాదాపు 1,200 సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెబుతున్నా, చాలా సేవలు అందుబాటులో లేవు. ప్రజలు తమ వివరాలిచ్చినా పొందడం సాధ్యం కాలేదు (ఎర్రర్‌‌ ఫ్యాట్చింగ్‌ ‌డిటైల్స్‌) అని సమాధానం వస్తోంది. దీంతో విసుగు చెందిన ప్రజలు ఆసక్తి చూపడం లేదు. 2025 జనవరి 30 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు మొదటి వారం వరకు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం 64.23 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో 32.26 కోట్ల లావాదేవీలు నేరుగా ప్రభుత్వ కార్యాలయాలు, సేవా కేంద్రాల ద్వారా భౌతికంగా జరిగాయి. మరో 27.65 కోట్ల లావాదేవీలు ఆన్‌‌లైన్‌ ద్వారా నమోదయ్యాయి. వాట్సాప్ ద్వారా జరిగినవి 4.32 కోట్లు మాత్రమే.

కీలక శాఖల్లోనూ వెనుకబాటే!

ప్రజలకు నిత్యం అవసరమయ్యే ప్రభుత్వ సేవలను అందించే కీలక శాఖల్లో వాట్సాప్ వినియోగం ఆశించినంత లేదు. గతేడాది జనవరి 30 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు మొదటి వారం వరకు నమోదైన లావాదేవీల ప్రకారం ఇంధన శాఖలో వాట్సాప్ వాటా 0.61 శాతం మాత్రమే. దేవాదాయశాఖలో 2.18, పురపాలక శాఖలో 5.63, రెవెన్యూ శాఖలో 6.18 శాతంగా ఉంది. అయితే పౌరసరఫరాల శాఖలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. దీర్ఘకాలిక లెక్కల్లో ఆ శాఖ లావాదేవీల్లో వాట్సాప్ వాటా 54.87 శాతంగా నమోదైంది. హోంశాఖలో దీర్ఘకాలికంగా 34.23 శాతం వాట్సాప్ లావాదేవీలు నమోదయ్యాయి. అయితే రెవెన్యూ, పురపాలక, ఇంధన వంటి కీలక శాఖల్లో వాట్సాప్ వినియోగం తక్కువగా ఉండటం డిజిటల్ సేవల విస్తరణలో శాఖల మధ్య అసమానతలను తెలియజేస్తోంది.

సమస్యలు ఎదురైతే పరిష్కరించే వ్యవస్థ ఏదీ?

​వాట్సాప్ పాలన ద్వారా ప్రజలకు సమయం ఆదా కావాలి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గాలి. సేవలు వేగంగా, పారదర్శకంగా అందాలి. కానీ ఈ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతున్నాయన్నది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్యలు ఎదురైతే పరిష్కరించే వ్యవస్థ లేదు. కేవలం వాట్సాప్‌‌లో వచ్చిన మెసేజ్‌ ‌మినహా, తదుపరి ఆ అంశాన్ని ఎవరి దృష్టికైనా తీసుకెళ్లేందుకు సరైన వ్యవస్థ లేదు. ఎవరికైనా సేవలు అందకపోతే అందుకు కారణాం చెప్పే పరిస్థితి లేదు. దీంతో వాట్సాప్‌ ‌సేవలపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై ప్రజలకు ఎంతవరకు అవగాహన, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలను వినియోగించుకునేందుకు తీసుకున్న చర్యలు, తదితర అంశాలపై సమగ్ర సమీక్ష అవసరం. ముఖ్యంగా భౌతిక సేవల ద్వారా ఇప్పటికీ 50.22 శాతం లావాదేవీలు జరుగుతుండటం, ఆన్‌‌లైన్‌ సేవల వినియోగం 43.04 శాతంగా ఉండటం చూస్తుంటే డిజిటల్ పాలనలో వాట్సాప్ ఒక్కటే ప్రధాన వేదికగా మారలేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వం కొత్త సేవలను ప్రకటించడం, వాటి సంఖ్యను పెంచడం కంటే ప్రజలు వాటిని సులభంగా వినియోగించుకునేలా చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంది. లేదంటే వేలాది సేవలు అందుబాటులో ఉన్నాయన్న ప్రచారం తప్ప, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలు మాత్రం పరిమితంగానే మిగిలిపోయే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్