- ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు శాయశక్తుల కృషి
- రైతులకు పంటల బీమా తప్పనిసరి
- తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి- యంత్రాంగం: అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావిత ప్రాంతాల్లోని చివరి వ్యక్తి వరకు ప్రభుత్వం సాయం అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ రెండు తుపాన్ల వల్ల పెద్ద ఎత్తున నష్టం వచ్చిందని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తోందన్నారు. మురసు తుపానుతో దెబ్బతిన్న గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. బాపట్ల జిల్లాలోని నల్లమడ కాల్వను పరిశీలించి దెబ్బతిన్న పంట కాల్వల ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
జమ్ములపాలెంలో రైతులతో మాట్లాడి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేటూరులో మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు మురసు తుపాను బాగా నష్టం కలిగించిందన్నారు. అధిక వర్షాల వల్ల తరచూ కృష్ణా డెల్టా పరిధిలో కాలువలు, వాగులు పొంగి జరుగుతున్న నష్టాలు, కష్టాలను శాశ్వతంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నల్లమడ డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రతి రైతు పంటల బీమా చేయించాలని కోరారు. బీమా చేయకపోతే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో పరిహారం అందదని, ప్రభుత్వం ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు జరిగిన నష్టానికి సరిపోదని తెలిపారు. కౌలు రైతులు సిపిఆర్‌సి కార్డులు తీసుకొని బీమా చేయించుకోవాలని, లేదంటే ప్రభుత్వ సాయం అందబోదని తెలిపారు. తీర ప్రాంతాలను తుపాన్లు దెబ్బతీస్తే, రాయలసీమ ప్రాంతాన్ని ఎల్‌నినో ఇబ్బంది పెట్టిందన్నారు. తీర ప్రాంతంలో నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని, రాయలసీమ ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోందని వివరించారు. నీటి భద్రతకు, సమర్థ నీటి నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
ఎర్ర కాలువకు గండితో నీట మునిగిన గ్రామాలు, పంట పొలాలు
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం శివారులోని కొండాలమ్మ గుడి సమీపంలో ఎర్ర కాలువకు గండి పడింది. వరుస తుపాన్లతో నీటిమట్టం భారీ పెరగడం, ప్రవాహ ఉధృతి వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. కాలువ నీరు ముంచెత్తడంతో నిడదవోలు మండలంలోని తాళ్లపాలెం, సింగవర గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరింది. కంసాలిపాలెం, రావిమెట్ల, సింగవరం, తాళ్లపాలెం, తిమ్మరాజుపాలెం, రావిమెట్ల, కోరుమామిడిలోని వరి, ఇతర పంటలు నీటి మునిగాయి. ఎర్ర కాల్వ ఉగ్రరూపంతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి మండలంలోని నందమూరు, జగన్నాథపురం, మారంపల్లి గ్రామాల్లోకి వరద భారీగా చేరింది. నందమూరు గ్రామస్తులు పునరావాస కేంద్రానికి వరద నీటిలో తరలివెళ్లారు. భీమవరం పట్టణానికి వరద ముంపు ప్రమాదం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.










కామెంట్‌లు (0)