- హైకోర్టు తీవ్ర విస్మయం
ప్రజాశక్తి-అమరావతి : కాకినాడ జిల్లాలో ఏడడుగుల లోతున్న కాలువ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. 1987లో పట్టాలు మంజూరు చేసినప్పటికీ, ఇన్నేళ్లుగా ఆ స్థలాలను నివాసయోగ్యంగా మార్చకపోవడంపై ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ప్రభుత్వాలు, అధికారులు పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఈ కేసు అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించింది. కాలువ భూముల్లో పట్టాలిస్తే పేదలు ఇళ్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించింది. బాధితులకు న్యాయం జరిగేలా కొత్త ప్రతిపాదనలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని కాకినాడ జిల్లా కలెక్టరును ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేట పరిధిలోని సర్వే నెంబర్ 195లో 1987లో ప్రభుత్వం 280 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసింది. అయితే ఆ భూములు పల్లంగా ఉండటంతో నివాసాలకు అనువుగా లేవు. వాటిని మెరకతో నింపి చదును చేయడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. స్పందన లేకపోవడంతో కాకినాడ, కాజులూరుకు చెందిన విజయలక్ష్మితో పాటు మరో 25 మంది 2013లో హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణ సందర్భంగా పట్టాలు మంజూరు చేసిన భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి.. అవి కాలువ భూములని గుర్తించారు. ఏడడుగుల లోతున్న ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తూ, బాధితులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టరును ఆదేశించారు.







కామెంట్లు (0)