- సిపిఎం, సిపిఐ ప్రకటన
- పోలింగ్‌లో ప్రజల పాత్ర లేకుండా చేశారని విమర్శ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై ప్రజాస్వామ్యపరిరక్షణ కోసం ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టనున్నట్లు సిపిఎం, సిపిఐ ప్రకటించాయి. శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ఈ విషయం తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజల పాత్ర ఏమీ లేదని, పోలీసులు, టిడిపి గూండాల పాత్రే ఉందని, అటువంటప్పుడు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను రానీయకుండా అభ్యర్థులను, ఏజెంట్లను భయపెట్టి నిర్బంధించి రిగ్గింగు చేసుకున్నారని, దీనిని 100 శాతం స్ట్రైక్ రేట్ అని సిఎం చెప్పుడానికి సిగ్గుపడాలని అన్నారు. డబ్బు పంపకం, హెచ్చరికలు, పోలీసు కేసులు బెదిరింపులకు పాల్పడి పూర్తి అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు జరుపుకున్నారని విమర్శించారు. రాష్ట్ర చర్రితలో ఎన్నడూ జరగని విధంగా సగం రాష్ట్రంలో ఎన్నికల అక్రమాలు జరిగాయని విమర్శించారు. ఎమ్మెల్యేలు అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. యథేచ్ఛగా రిగ్గింగు చేశారని, అడ్డుకున్న వామపక్ష పార్టీల అభ్యర్థులను పోలీసులు వచ్చి కొట్టి నిర్బంధించారని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు అంటే ఏజెంట్లను కొట్టడం, బెదిరించడం, రిగ్గింగు అని టిడిపి కొత్త నిర్వచనం చెబుతోందని తెలిపారు. అనంతపురం, కర్నూలు నుండి శ్రీకాకుళం వరకూ రిగ్గింగు ప్రక్రియ జరిగిందని విమర్శించారు. కర్నూలు జిల్లా ఉల్చాలలో సిపిఎం అభ్యర్థులపై పోలీసులే దాడులకు దిగారని అన్నారు. ప్రజలకు మంచి చేశామనే నమ్మకం ఉంటే అధికారపార్టీ రిగ్గింగుకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలుస్తోందని అయినా టిడిపి రిగ్గింగుకు పాల్పడిందంటే ప్రజలపై నమ్మకం కోల్పోయి భయపడుతోందని అర్థమవుతోందన్నారు. 2029లో ఇదే పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యం పరిహాసమవుతుందన్నారు. ఒకవైపు ఓట్లు కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత ఆందోళనలు జరుగుతుంటే మరోవైపు ఉన్న ఓట్లు వేసుకోనీయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మోడీ కనుసన్నల్లో పనిచేస్తున్న ఎన్నికల సంఘం ఏకపక్ష విధానాలతో ముఖ్యంగా యువత ఓట్లను తొలగిస్తోందని, కర్నాటకలో 24 లక్షల మంది యువత ఓట్లను తొలగించారని అన్నారు. దేశంలో జెన్‌జీ యువత ముందుకు వస్తోందని, అమెరికాలోనూ ప్రభుత్వంలో మార్పులు వచ్చాయని, దాని ప్రభావం ఆయన అనుచరుడిగా ఉన్న మోడీపైనే పడుతుందని, అనంతరం రాష్ట్రంలోనూ జెన్‌జీ ప్రభావం ఉంటుందని తెలిపారు. దీన్ని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యువతను చైతన్యం చేయడంతోపాటు ఎన్నికల అక్రమాలను ప్రజలకు వివరించేందుకు 11వ ప్రజాస్వామ్య పరిరక్షణ దినం పేరుతో నిరసనలు చేపడతామని అన్నారు. ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గూండా రాజ్యం నడుస్తోందని చెప్పారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పోరు అధ్వానంగా ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షపార్టీలు, వామపక్ష పార్టీల అభ్యర్థులనూ నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని అన్నారు. దేశంలో 13 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయారని ఆందోళన జరుగుతుంటే, రాష్ట్రంలో ఓటు వేయనీయకుండా దాడులు చేశారని విమర్శించారు. ప్రభుత్వం అనుసరించిన దుర్మార్గ వైఖరిని నిరూపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, 11వ తేదీన జరిగే నిరసనలను జయప్రదం చేయాలని తెలిపారు.
కేసులతో ప్రారంభమై కేసులతో ముగిసే జీవితాలు
11వ తేదీన నిరసన వ్యక్తం చేస్తే కేసులు పెడతామనే బెదిరింపులకు కమ్యూనిస్టు పార్టీలు భయపడవని శ్రీనివాసరావు అన్నారు. కమ్యూనిస్టుల జీవితాలు కేసులతో ప్రారంభమై, కేసులతోనే ముగుస్తాయని చెప్పారు. ఇదే పద్ధతిని ప్రభుత్వాలు అనుసరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వైనాట్ 175 అన్న జగన్మోహన్రెడ్డికి ఏమైందో చూశారని, 100 శాతం స్ట్రైక్ రేట్ అన్న చంద్రబాబుకు కూడా అదేగతి పడుతుందని అన్నారు. అమెరికాలోనూ విర్రవీగిన ట్రంప్ ఓడిపోయారని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.
ఓటమి నుండి గుణపాఠాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థుల ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకుని ప్రజా సమస్యలపై పోరాటంతో మరింత ముందుకు వెళతామే తప్ప కుంగిపోబోమని శ్రీనివాసరావు, ఈశ్వరయ్య చెప్పారు. విజయవాడ లాంటి నగరంలో ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రజల సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తున్నారని, మోడీకి వ్యతిరేకంగా నిలబడ్డారని, అందువల్లే మద్దతు ఇచ్చామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో కమ్యూనిస్టులకు ఎదురుగాలి ఉందని ప్రస్తుతం ప్రత్యామ్నాయ పరిస్థితులకు అనుకూలంగా ఉందన్నారు.







కామెంట్లు (0)