మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈసారైనా ఎన్నికలు జరిగేనా ?

1 గంట క్రితం

Will the elections be held this time, at least?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 10:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

2019 నుంచి 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన

గ్రామాల విలీనంపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసులు

టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా లభించని పరిష్కారం

మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సమన్వయలోపం


ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఒకవైపు సన్నాహాలు జరుగుతుండగా మరోవైపు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉంచిన నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కన్పించడం లేదు. పరిసర గ్రామాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ల్లో విలీనం చేస్తూ గత ప్రభుత్వం 2020లో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆయా గ్రామాలకు చెందిన కొందరు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. దీంతో, ఎన్నికలు నిర్వహించకుండా, గ్రామాల విలీనంను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

2021 మార్చి పదిన రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినా శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లకు జరగలేదు. మున్సిపాలిటీలకు సంబంధించి రాజాం, ఆముదాలవలస, తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి, తాడిగడప, గుడివాడ, బాపట్ల, నరసరావుపేట, పొన్నూరు, కందుకూరు, పొదిలి, కావలి, ఆలూరు, గూడూరు, బి కొత్తకోట, శ్రీకాళహస్తిలోనూ ఎన్నికలు నిర్వహించలేదు. 2021లో ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఐదేళ్ల కాలపరిమితి

పూర్తయి ఈ ఏడాది మార్చి 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. మళ్లీ మున్సిపల్ ఎన్నికలకు సిద్దం అవుతున్న ప్రభుత్వం పెండింగ్లో ఉన్న నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలపై ఏ మాత్రమూ దృష్టి సారించడంలేదని పలువురు టిడిపి ఎమ్మెల్యేలూ ఆక్షేపిస్తున్నారు. వీటిపై అప్పట్లో వైసిపి జారీ చేసిన జిఒలకు మున్సిపల్ పరిపాలన శాఖ చట్టసవరణ చేయాల్సి ఉందని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా గత రెండేళ్లలో స్పందన లేదని టిడిపి ఎమ్మెల్యే ఒకరు 'ప్రజాశక్తి' వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన శాఖల మధ్య సమన్వయం కొరవడిందని కూడా చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కోర్టులో కేసులు తొలగినా ఎన్నికలు జరగడంలేదని ఆ ప్రాంత టిడిపి నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోర్టు వివాదాల వల్ల పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట మున్సిపాలిటీలలో 2021లో గ్రామాలు విలీనం ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. 2014 తరువాత ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ, బాపట్ల, పొన్నూరు, నరసరావుపేటలో ఎన్నికలు జరగకపోవడంతో 2019 నుంచీ ఈ పట్టణాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. నర్సరావుపేట పట్టణ పరిధిలో గ్రామాల విలీనంపై ఉన్న కేసులను టిడిపి వారు ఉపసంహరించుకోగా వైసిపి వారు ఇంకా ఉపసంహరించుకోకపోవడం వల్ల కోర్టులో వివాదం నేటికీ నడుస్తోంది. విలీన గ్రామాల వివాదం కారణంగా ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. కోర్టు కేసుల కారణంగా 23 మున్సిపాలిటీలకు నిధులు రావడం లేదు. పట్టణాల్లో గ్రామాల విలీనానికి దాదాపు 110 పంచాయతీల్లో 2021లో ఎన్నికలు జరగలేదు. 2018 నుంచి ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కోర్టు వివాదాల వల్ల ఆగిపోయిన కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీల్లోనూ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్