mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయి కృష్ణ ఘటనపై సిబిఐ దర్యాప్తు

8 గంటల క్రితం

ys jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 12:55 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - విజయవాడ సాయి కృష్ణ ఘటనపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో విజయవాడ పోలీసు కమిషనర్‌, ఎసిపితోపాటు డిజిపి ప్రమేయం కూడా ఉందని, వారిపై హత్య కేసు నమోదు చేయాలన్నారు. కేవలం కంటి తుడుపుగా కృష్ణలంక సిఐను సస్పెండ్‌ ‌చేశారని విమర్శించారు. విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌‌లో లాకప్‌డెత్‌కు గురైనట్లు భావిస్తున్న గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులను గురువారం సాయంత్రం జగన్‌ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మే 9న సాయికృష్ణను తీసుకెళ్లిన పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, ఆ తర్వాత పోలీసులే దహనం చేశారన్నారు. కొడుకు కోసం పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్న సాయికృష్ణ తల్లితో ‘కొడుకు ఫొటోకు దండ వేసుకో’ అని సిఐ హేళనగా మాట్లాడారని విమర్శించారు. కృష్ణలంక పోలీసుస్టేషన్‌ ‌పరిధిలోనే ఇలాంటి ఘటనలు రెండు జరిగాయని చెప్పారు. సిఐ వేధిస్తున్నాడని క్రాంతికుమార్‌ అనే యువకుడు సెల్ఫీ వీడియోలో మరణవాగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇద్దరి చావుకు కారణమైన కృష్ణలంక సిఐపై కేసు పెట్టకుండా కేవలం సస్పెన్షన్‌ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఈ నేరానికి సిఐని మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని, విజయవాడ పోలీసు కమిషనర్‌, ఎసిపి, డిజిపి ప్రమేయం ఉందని, వారిపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. జరిగిన ఘటనపై తల్లితోపాటు సాయికృష్ణ చిన్నమ్మ అయిన న్యాయవాది తదితరులు డిజిపి కార్యాలయానికి వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ ఫిర్యాదును పోలీసు కమిషనర్‌‌కు పంపడం, ఆయన చర్యలు తీసుకోకుండా కొంతమందిని పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారని, చివరకు ఆ ఫిర్యాదు చెత్త బుట్టలోకి వెళ్లిందన్నారు. ​అందరూ కూడబలుక్కుని ఒకరినొ కరు వెనకేసుకువస్తున్నారని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసు అధికారులు, వీరు చేస్తున్న చర్యలతో రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి కూడా ప్రజలు భయపడే పరిస్ధితి నెలకొందన్నారు. ఈనెల 2న సాయికృష్ణ తల్లి హైకోర్టులో హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌ ‌వేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవడం తో గత్యంతరం లేక ఎట్టకేలకు సిఐను సస్పెండ్‌ ‌చేశారని చెప్పారు. ఆ సిఐను కాపాడుతూ ఎసిపి..., ఎసిపిని కాపాడుతూ కమిషనర్..., కమిషనర్‌ను కాపాడుతూ డిజిపి... ఇలా అందరూ ఈ ఘటనలో భాగస్వాములయ్యారని చెప్పారు. హైకోర్టు దాకా బాధితులు వెళ్లకపో యింటే ఈ ఘటన వెలుగు చూసేది కాదన్నారు. స్థానిక టిడిపి, జనసేన నాయకులు సాయికృష్ణ తల్లి వద్దకు వచ్చి సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. ఇంతమంది పెద్దల ప్రమేయం ఉన్న ఈ ఘటనపై ఎస్‌‌పి స్థాయి అధికారితో దర్యాప్తు జరిపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సాయికృష్ణ తప్పు చేసి ఉంటే కోర్టులు నిర్ధారించి శిక్షలు వేస్తాయని, కానీ అతడిని కోర్టులో ప్రవేశపెట్టకుండా చిత్ర హింసలకు గురిచేసి చంపేశారని పేర్కొన్నారు. సాయికృష్ణ ఘటనలో వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్