- విద్యాభివృద్ధికి, లౌకికవాదానికి, జాతీయ సమైక్యతకు ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయం
తాడేపల్లి : భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆజాద్ చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యావ్యవస్థకు బలమైన పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అని వైయస్ జగన్ కొనియాడారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవుతాయని విశ్వసించిన గొప్ప దార్శనికుడు ఆజాద్ అని పేర్కొన్నారు. దేశంలో విద్యావ్యాప్తికి, ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, మతసామరస్యం, లౌకికవాదం, జాతీయ సమైక్యత కోసం జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆజాద్ అని గుర్తుచేసుకున్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందాలన్న ఆయన ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్య అనేది కేవలం వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ ప్రగతికి, దేశాభివృద్ధికి పునాది అని ఆజాద్ బలంగా విశ్వసించారని, ఆయన ఆలోచనలు భావితరాలకు మార్గదర్శకమని వైయస్ జగన్ స్మరించుకున్నారు. ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం విద్యారంగానికి ఆయన అందించిన సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మైనార్టీ నాయకులు మహ్మద్ రుహుల్లా, డాక్టర్ మెహబూబ్ షేక్, షరీఫ్, దస్తగిరి, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)