గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వార్షిక రుణ ప్రణాళిక రూ.8.10 లక్షల కోట్లు

19 జూన్, 2026

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 11:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వ్యవసాయానికి రూ.5.40 లక్షల కోట్లు

- ఆర్ధిక నేరాల అడ్డుకట్టకు బ్యాంకుల ప్రత్యేక ఎస్వోపీ

- రుణాల మంజూరులో ఎంఎస్ఎంఈ రంగానికి ప్రాధాన్యత

- విద్యా రుణాలకు అదనంగా 4 శాతం వడ్డీ రాయితీకి నిర్ణయం

- 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన 235 రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వివిధ రంగాలకు రూ.8.10 లక్షల కోట్ల మేర రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయం సహా ప్రాధాన్యతా రంగాలకు రూ.5.4 లక్షల కోట్లు, ఇతర రంగాలకు రూ.2.70 లక్షల కోట్లు ఇవ్వాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి రూ.3.60 లక్షల కోట్లు, పంట రుణాల కింద రూ.2 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. వ్యవసాయ యాంత్రీకరణ రూ.10,693 కోట్ల మేర ఆర్థిక సహకారం అందించాలని రుణ ప్రణాళికలో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఇ రంగానికి రూ.1.55 లక్షల కోట్లు, మైక్రో ఎంటర్ ప్రైజెస్ కోసం రూ.70 వేల కోట్లు, గృహ నిర్మాణానికి రూ.11,500 కోట్లు, విద్యా రుణాలకు రూ.2,500 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఇలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన వారికి రుణాలివ్వడంలో బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు. రుణ వితరణ, ఎన్‌పిఎలపై బ్యాంకర్లు- అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా పెద్దయెత్తున వ్యాపారవేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. బ్యాంకులు సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్స్‌ను ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌ను నియంత్రించాలన్నారు. డిజిటల్ అరెస్టు పేరిట చదువుకున్నవారు కూడా పెద్ద మొత్తంలో నగదు కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలో గడిచిన మూడు నెలల్లో పెద్దయెత్తున ప్రజలు ఈ డిజిటల్ ఫ్రాడ్‌లో నగదు కోల్పోయారన్నారు. ఈ నేరాలను విశ్లేషించి తగిన ఎస్‌ఒపిని రూపొందించాలని ఆదేశించారు. ఈ నేరాలపై ప్రజలను చైతన్య పరిచేలా పెద్దయెత్తున కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. విద్యా రుణాలపై వడ్డీలో 4 శాతం రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పిఎం సూర్యఘర్ కింద 10 లక్షల కుటుంబాలకు పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పిఎం విశ్వకర్మ లాంటి కేంద్ర పథకాలకు బ్యాంకులు పూర్తిగా సహకారాన్ని అందించాలన్నారు. డెయిరీ, ఆక్వా కల్చర్, కోల్డ్ చైన్ లాంటి వివిధ రంగాలు వృద్ధి చెందేలా రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధనలో బ్యాంకర్లు సహకారం అందించాలని సూచించారు. రాజధాని అమరావతిలో భూములు తీసుకున్న బ్యాంకులు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న బ్యాంక్స్ స్ట్రీట్‌లో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. ఈ ఏడాది 15 శాతం వృద్ధిరేటు సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నామని, దానికి అనుగుణంగా ఆయా రంగాలకు బ్యాంకులు ఆర్థిక ఊతం ఇవ్వాలని సిఎం చంద్రబాబు తెలిపారు. సమావేశంలో యూనియన్ బ్యాంకు సిఎమ్‌‌డి, సిఇఒ ఆశీష్ పాండే, సిఎస్ సాయి ప్రసాద్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ డైరెక్టర్ నీలమ్ అగ్రవాల్, ఆర్‌‌బిఐ రీజినల్ డైరెక్టర్ ఎఒ బషీర్, నాబార్డు జిఎం కెవిఎస్ ప్రసాద్, నేషనల్ ఎస్‌‌టి కమిషన్ సునీల్ కుమార్ బాబుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్