ప్రజాశక్తి-అమరావతి: ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం (పిఎల్‌సిఎఫ్) పేరుతో పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసు యూనిఫాంలో కౌన్సెలింగ్ నిర్వహించడం ప్రజలను భయపెట్టడమేనని పేర్కొంది. సివిల్ వివాదాలతో పోలీసులకు ఏం సంబంధమని ప్రశ్నించింది. పిఎల్‌సిఎఫ్ పేరుతో ఎవరినీ నోటీసులు జారీ చేసి పిలవొద్దని విశాఖపట్నం పోలీసులను ఆదేశించింది. ఏ చట్టం కింద నోటీసులు ఇస్తున్నారు, ఫోరం ఏర్పాటుకు ఉన్న నిబంధనలు, మార్గదర్శకాలు ఏమిటో వివరిస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిఎల్‌సిఎఫ్ పేరుతో పోలీసులు తమను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని సినీ నిర్మాత నట్టి కుమార్, వ్యాపారి మంచుకొండ రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ఫోరం పరిధి, చట్టబద్ధత, అధికారాలపై సందేహాలు వ్యక్తం చేసి రికార్డులను సిజె ముందుంచాలని ఆదేశించారు. అనంతరం సిజె ధర్మాసనం ఈ వ్యవహారాన్ని సుమోటో రిట్‌గా స్వీకరించి, సీనియర్ న్యాయవాది గంటా రామారావును అమికస్ క్యూరీగా నియమించింది. సోమవారం విచారణలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి.. 2004 నుంచి ఫోరం పనిచేస్తోందని, వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకే ఏర్పాటు చేశామని తెలిపారు. అమికస్ క్యూరీ గంటా రామారావు వాదిస్తూ, విజయవాడలో ఇలాంటి ఫోరంను హైకోర్టు గతంలో తప్పుపట్టి నిలిపివేసిందని చెప్పారు. సివిల్ వివాదాల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నప్పటికీ పోలీసులు పిఎల్‌సిఎఫ్ పేరుతో నోటీసులు ఇస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు ఆగ్రహం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)