- యువత రాజకీయాల్లోకి రావాలి
- నటుడు రానా దగ్గుబాటితో పాడ్‌కాస్ట్‌లో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం: విశాఖ నగరం రాష్ట్రానికి ప్రవేశ ద్వారం అయితే, భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేట్ వే లాంటిదని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో 31వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో ‘ది పవర్ ఆఫ్ పాసిబిలిటీ: బిల్డింగ్ పార్ట్‌నర్‌షిప్స్, క్రియేటింగ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై ప్రముఖ సినీనటుడు రానా దగ్గబాటి నిర్వహించిన పాడ్ కాస్ట్ కు మంత్రి లోకేష్ అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... భోగాపురం ఎయిర్ పోర్టు హైదరాబాద్ విమానాశ్రయం కంటే పెద్దదిగా ఎదిగిన రోజే తనకు నిజమైన సంతృప్తి కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇలాంటి పెద్ద లక్ష్యాలు కీలకమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, బ్రాండ్ ఆంధ్ర, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పర్యాటక అభివృద్ధి, సినిమా పరిశ్రమ, క్రియేటర్ ఎకానమీ, యువతకు ఉపాధి–వ్యాపార అవకాశాలు తదితర అంశాలపై రానా అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సూటిగా సమాధానాలిచ్చారు.
''సినిమా, సంగీతం, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాల్లో యువతకు శిక్షణ అందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. సంగీత దర్శకులు, సినిమా రంగంలోని అనుభవజ్ఞులతో కలిసి యువతకు శిక్షణ కార్యక్రమాలు రూపొందిస్తాం. సంగీత శిక్షణ కోసం థమన్‌తో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. తిరుపతిలోనూ ఇందుకోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ సహా వివిధ విభాగాల్లో నిపుణుల అనుభవాన్ని యువతకు అందించాలన్నది మా ఆలోచన. దీనికి కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆధునిక సాంకేతికతను జోడిస్తాం. తద్వారా వినోద రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తాం. యువతలో ఏదో ఒకటి సాధించాలనే బలమైన తపన ఉండాలి, అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని'' మంత్రి లోకేష్ అన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలి
యువత రాజకీయాల్లోకి రావాలి. ప్రస్తుతం రాజకీయాల్లో యవతకు మంచి అవకాశాలున్నాయి. విశాఖ మేయర్‌తో పాటు పలువురు యువ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు బాధ్యతలు ఇటీవల ఎన్నికయ్యారు. వ్యవస్థలో లోపాలున్నాయని విమర్శించడం కాదు, వాటికి పరిష్కారాలు చూపించే ప్రక్రియలో యువత భాగస్వాములు కావాలి. సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత అధికారులు, సంస్థలు, ప్రజాప్రతినిధులను కలుస్తూ పట్టుదలతో పనిచేయాలి. పెద్ద కలలు కనడంతోపాటు వాటిని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించడం, ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయడం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుంది.







కామెంట్‌లు (0)