- నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక శిక్షణలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత చర్చలు
ప్రజాశక్తి హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రంలో సాంకేతిక విద్యను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంతో పాటు యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి డా.వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (సియుటిఎం)ను బుధవారం సందర్శించింది. సెంచూరియన్ యూనివర్సిటీ అమలు చేస్తున్న ‘లెర్న్ అండ్ ఎర్న్’విధానం, లైవ్ ప్రొడక్షన్ యూనిట్లు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కరికులం, నైపుణ్యాభివృద్ధి నమూనాలను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఒడిశా ప్రభుత్వం ‘స్కిల్ యూనివర్సిటీ’గా గుర్తించిన సెంచూరియన్ వర్సిటీ విద్యార్థులకు డిగ్రీలతో పాటు పరిశ్రమ స్థాయి పరికరాలపై ప్రత్యక్ష ప్రయోగాత్మక శిక్షణ అందిస్తోంది. అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ట్రాన్స్ఫార్మర్ల తయారీ, CNC మెషినింగ్, స్మార్ట్ అగ్రికల్చర్, అప్పారెల్ ప్రొడక్షన్ తదితర రంగాల్లో లైవ్ ప్రొడక్షన్ యూనిట్లను నిర్వహిస్తోంది. ఈ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించడం ద్వారా విద్యార్థులు పరిశ్రమ అనుభవాన్ని పొందడంతో పాటు స్టైపెండ్ పొందే అవకాశం కల్పిస్తున్న విధానాన్ని ప్రతినిధి బృందం పరిశీలించింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించేందుకు ‘గ్రామ్ తరంగ్’ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ముక్తి కె. మిశ్రా, వివిధ విభాగాల అధిపతులతో మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. లైవ్ ప్రొడక్షన్ యూనిట్ల నిర్వహణ, ఆర్థిక వనరుల సమీకరణ, పరిశ్రమలతో అనుసంధానం, విద్యా కార్యక్రమాల్లో క్రెడిట్ పద్ధతుల అనుసంధానం వంటి అంశాలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో శక్తి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి సంస్కరణలను వివేక్ వెంకటస్వామి వివరించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు, ‘పీఎం సేతు’ ద్వారా ఐటీఐల ఆధునీకరణ, అత్యున్నత ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ’ఏర్పాటు, టామ్ కామ్ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాల కల్పన వంటి కార్యక్రమాలను వివరించారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న నైపుణ్య శిక్షణ వ్యవస్థకు సెంచూరియన్ యూనివర్సిటీ అనుభవాలను అనుసంధానించే అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది. బృందంలో పెద్దపల్లి ఎంపి వంశీకృష్ణ, ఉపాధి, శిక్షణ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర అధికారులు ఉన్నారు.








కామెంట్లు (0)