రోడ్డుపై బైఠాయించిన అభ్యర్థులు, నిరుద్యోగులు
తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి: డివైఎఫ్‌ఐ
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా) : జిఒ నంబర్ 13 ప్రకారం మంజూరైన 2,260 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు, అభ్యర్థులు కదం తొక్కారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ కార్యాయలం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు లోపలికి వెళ్తున్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో తీవ్ర తోపులాటలు చోటు చేసుకున్నాయి. తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవాలని ఆందోళనకారులు కోరడంతో అధికారులతో మాట్లాడి అనంతరం ప్రతినిధులను పోలీసులు లోపలికి అనుమతించారు. అయితే వినతిపత్రం తీసుకునేందుకు విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఎ. సుబ్బారెడ్డి నిరాకరించారు. ఆందోళనకారులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారుల వల్లే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఆందోళనలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గత ప్రభుత్వం 2,260 పోస్టులకు కేబినెట్ ఆమోదం ఇచ్చినప్పటికీ, ఇప్పటి వరకూ భర్తీ చేయలేదని విమర్శించారు. 2022 నుంచి ఇప్పటివరకు ఆరు స్పెషల్ టెట్ పరీక్షలు నిర్వహించినప్పటికీ, ఒక్క ప్రత్యేక డిఎస్‌సి నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదని తెలిపారు. ఆందోళనకారులు మాట్లాడుతూ... వికలాంగ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యాయుల కొరతను నివారించాలని, 1:10 నిష్పత్తి నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి ప్రత్యేక డిఎస్‌సిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం రమణ, డి వైఎఫ్‌ఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గణేష్, నిరుద్యోగులు సింధు, సుకన్య, పార్వతి, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)