ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జైల్‌భరో జయప్రదం చేసిన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులకు వామపక్ష పార్టీలు అభినందనలు తెలిపాయి. అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని కోరాయి. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సిపిఐఎంఎల్ న్యూడెమెక్రసీ నాయకులు పి.ప్రసాదు, ఎం.రామకృష్ణ, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు బంగార్రావు, ఎంసిపిఐయు నాయకులు కాటం నాగభూషణం, సిపిఐఎంఎల్ నాయకులు జాస్తి కిషోర్‌బాబు, ఎస్‌యుసిఐసి నాయకులు బి.ఎస్.అమర్‌నాథ్, ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు పి.వి.సుందరరామరాజు, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరాములు సోమవారం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రాష్ట్రవ్యాపితంగా జైల్‌భరో కార్యక్రమం జయప్రదం చేసినందుకు కార్మికులకు, రైతులకు వామపక్ష పార్టీలు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 100 కేంద్రాల్లో రాస్తారోకోలు, కేంద్ర కార్యాలయాల ముట్టడిలో వేలాదిగా పాల్గొన్నారని, ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న శ్రీకాకుళం, అనకాపల్లి, తిరుపతి, కాకినాడ, గుంటూరు, ఏలూరు, నంద్యాల, విజయవాడ, ఉయ్యూరు సుమారు 10 జిల్లాల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్టులు చేయడాన్ని ఖండించారు. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజా నిరసనను పరిగణలోకి తీసుకొని కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, రూ.31వేలు కనీస వేతనం చెల్లించాలని, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టం పునరుద్దరించాలని డిమాండు చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అమెరికాతో చేసుకున్న నష్టకర స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని వారు డిమాండు చేశారు.







కామెంట్‌లు (0)