నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం
ఉత్తరాంధ్ర బీడు భూముల్లో ఇక పంటలే...
అనకాపల్లికి చేరిన గోదావరి నీటికి జలహారతిలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి- అనకాపల్లి, పాయకరావుపేట : ‘ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలోని బీడు భూముల్లోనూ పంటలు పండుతాయి. అనకాపల్లి జిల్లాలో అడుగుపెట్టి ఉత్తరాంధ్రకు తరలి వచ్చిన గోదారమ్మకు ప్రణమిల్లుతున్నా. గోదావరి మూడు పాయలు గౌతమి, వశిష్ట, వైనతేయ సముద్రంలో కలుస్తుంటే... ఇప్పుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి తరలి వచ్చింది. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు ఈ జలాలను తీసుకెళ్తాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు బుధవారం ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టాయి. పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ప్రవహించిన గోదారమ్మకు చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. ఆ జలాలను శిరస్సుపై జల్లుకుని అనంతరం అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పోలవరం ఎడమ కాలువలో నిల్చొని గోదావరి జలాలకు పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించారు. కాలువకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో చేరిన స్థానికులు, రైతులు, మహిళలు పుష్పాలతో జలాలకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. అరుణవర్ణంలో పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి సాష్టాంగ నమస్కారం చేశారు. జలహారతి అనంతరం క్రాస్ రెగ్యులేటర్ వద్దకు చేరుకుని స్థానిక రైతులతో కలిసి రెగ్యులేటర్ గేట్లను సిఎం ఎత్తారు. ఎడమ కాలువ ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.23 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ప్రణాళిక రూపొందిచినట్లు తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు, తాగు, సాగునీటి అవసరాలకు 23.44 టిఎంసిల నీటిని తరలించేలా ప్రణాళిక తయారు చేసినట్టు సిఎంకి జలవనరుల శాఖ అధికారులు వివరించారు.
రూ.4,192 కోట్లు ఖర్చు
జలహారతి కార్యక్రమం అనంతరం అక్కడికి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.4,192 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఏలేరు కాలువపై సైఫన్, పంపా, తాండవ, వరాహ నదులపై ఆక్విడెక్టులు నిర్మించి కాలువ పనులు పూర్తి చేశామని తెలిపారు. మరో రూ.800 కోట్లు ఖర్చు చేసి మొత్తం పనులు పూర్తి చేస్తామన్నారు. తాళ్లపాలెంలో భూ వివాదాన్ని పరిష్కరించి నిర్వాసితులకు పునరావాసం కల్పించామన్నారు. లెఫ్ట్ కెనాల్‌లో ప్రవహిస్తున్న ప్రతి నీటి చుక్క వెనుక ఇంజనీర్ల ప్రతిభ, కార్మికుల కష్టం, రైతుల నిరీక్షణ, నిర్వాసితుల త్యాగం, ప్రభుత్వ సమర్థత ఉన్నాయని సిఎం పేర్కొన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సాకారం కావడానికి ఏడు ముంపు మండలాలను తెలంగాణ నుంచి రాష్ట్రంలో విలీనం చేసేలా కృషి చేశామని తెలిపారు. ప్రతి సోమవారాన్ని పోల వారంగా మార్చుకుని 2019 వరకు 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన పార్టీ పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసిందంటూ వైసిపిపై విమర్శలు గుప్పించారు. 2024లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం ద్వారా ప్రజలే పోలవరానికి శాప విముక్తి కల్పించారని పేర్కొన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం చేస్తామన్నారు. రూ.3,200 కోట్లతో ఉత్తరాంధ్రలోని 12 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. గత రెండేళ్లలో సాగునీటి రంగంలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. గోదావరి-కృష్ణా సహా రాష్ట్రంలోని అన్ని నదులనూ అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తామన్నారు.
ఇక ఉత్తరాంధ్రకే వలసలు
నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయన్నారు. ఆరు నెలల క్రితం అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. పెద్ద డేటా సెంటర్లు, ఐటి కంపెనీలు వస్తున్నాయని, ఆసియా మొత్తాన్ని అనుసంధానించే సబ్‌సీ కేబుల్ కనెక్టివిటీ కూడా రానుందని తెలిపారు. హార్బర్లు, మూలపేట పోర్టుల ద్వారా తూర్పు తీరాన్ని మధ్య భారత్‌తో అనుసంధానిస్తామన్నారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి తరహాలో అనకాపల్లి అభివృద్ధికి చిరునామాగా మారనుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లడం కాదు... ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే పరిస్థితి వస్తుందని, ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారనుందని అన్నారు. విశాఖ ఇక ఎఐ పట్నంగా మారుతుందని పేర్కొన్నారు. డేటా సెంటర్లతో నీరు, విద్యుత్ కొరత వస్తుందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటితో పోలిస్తే పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందన్నారు. ఎడమ కాలువను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన జలవనరుల శాఖ ఇంజనీర్లను సిఎం సత్కరించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కె.పార్ధసారథి, ఎంపీలు విజయ్, సిఎం రమేశ్, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సిపిఎం నేత అప్పలరాజు గృహ నిర్బంధం
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సిఎం పర్యటన అనంతరం విడుదల చేశారు. పోలీసు నిర్బంధాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఓ ప్రకటనలో ఖండించారు.







కామెంట్‌లు (0)