బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition1.23 లక్షల ఐటి ఉద్యోగాలు ఉఫ్‌

1 గంట క్రితం

Gemini_Generated_Image_kdlzggkdlzggkdlz.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 12:16 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • భారత్‌లో 3వేల మందిపై వేటు

  • టెకీలలో పెరుగుతున్న ఆందోళన

శాన్‌‌ఫ్రాన్సిస్కో : టెక్‌ కంపెనీల పొదుపు చర్యలు ఉద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. గడిచిన ఎనిమిది నెలల వ్యవధిలోనే ప్రపంచ టెక్ పరిశ్రమలో లక్షకు పైగా ఉద్యోగాలు గాలిలో కలిసిపోయాయి. గత ఏడాది మొత్తం జరిగిన కోతల కంటే ఇది ఎక్కువ కావడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకప్పుడు అధిక వేతనాలు, ఉద్యోగ భద్రతకు ప్రతీకగా నిలిచిన టెక్ రంగం ఇప్పుడు ఒక్కసారిగా ఉద్వాసనల భయంతో వణికిపోతోంది. 2026లో ఇప్పటివరకు నమోదైన ఉద్యోగాల కోతలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ రిపోర్ట్‌ ప్రకారం, ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 289 టెక్ కంపెనీలు 1,23,305 మంది ఉద్యోగులను తొలగించాయి. 2025లో మొత్తం 278 కంపెనీల్లో 1,22,606 మంది ఉద్యోగాలు ‌పోయాయి. మరో నాలుగు నెలలు మిగిలి ఉండగానే 2026 ఆ సంఖ్యను 699 మేర అధిగమించింది. అంటే ఏడాది ముగిసే నాటికి ఈ లెక్క మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎఐపై పెట్టుబడులతో పాటు, కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, డేటా సెంటర్ల కోసం టెక్ కంపెనీలు బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ఆ ఖర్చులను సమతుల్యం చేసుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు చెబుతున్నారు.

దిగ్గజాల్లోనే తొలి వేటు..

​ఉద్యోగాల కోతల జాబితాలో టెక్ దిగ్గజాలే ముందున్నాయి. ఒరాకిల్ దాదాపు 21,000 ఉద్యోగులను తొలగించింది.అమెజాన్ 17,267, డెల్ 11,000, మెటా 10,400 ఉద్యోగులను ఇంటికి పంపించాయి. మైక్రోసాఫ్ట్ సుమారు 4,800 మందిని తొలగించగా, పేపాల్, బ్లాక్, సిస్కో తదితర సంస్థలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలు చేపట్టాయి. ఒకప్పుడు ఉద్యోగుల కోసం పరస్పరం పోటీ పడి భారీ ప్యాకేజీలు ఇచ్చిన కంపెనీలే ఇప్పుడు అదే ఉద్యోగులను ఖర్చుగా చూడడం టెక్ రంగంలో మారిన వాస్తవానికి నిదర్శనం. తాజా పరిణామాల్లో ఒరాకిల్ మరో విడత ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడం భారత టెకీల్లో ఆందోళన పెంచు తోంది. భారత్‌లో దాదాపు 3,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.

​​ఉబర్‌‌లో 3,300 ఉద్యోగాల కోత..

​ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ దిగ్గజం ఉబర్‌‌ కూడా ‌వేలాది సిబ్బందిని తొలగించే పనిలో పడింది. ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందికి అంటే దాదాపు 3,300 మందికి ఉద్వాసన పలకనుందని రిపోర్ట్‌‌లు వస్తున్నాయి. సంస్థలో పెరిగిన మేనేజ్‌మెంట్ లేయర్లను తగ్గించి కార్యకలాపాలను మరింత సరళీకరించడం, రైడ్‌షేరింగ్, డెలివరీ, రోబోట్యాక్సీ వ్యాపారాలపై దృష్టి పెట్డడం దీనికి కారణంగా చెబుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్