ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగర పాలక సంస్థకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి నగరంలో ప్రజా పాలన సాగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం సినిమా రోడ్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణ లు మాట్లాడుతూ.. 2005లో కాకినాడ మున్సిపాలిటీ స్థాయి నుండి కార్పొరేషన్ స్థాయికి అభివృద్ధి చెందడం పట్ల నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేసారన్నారు. ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయని, పౌర సేవలు మరింత మెరుగు పడతాయని ఆశించారన్నారు. ఆచరణలో ప్రజలపై భారాలు పన్నుల రూపంలో పెరిగాయన్నారు. శానిటేషన్ నిర్వహణలో కీలకమైన వాహనాల రిపేర్లు కూడా సకాలంలో చేయించలేని పరిస్థితి, నూతన వాహనాలు కొనే ఆర్ధిక స్థాయి నగర పాలక సంస్థకు లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు, స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వం నుండి నగర పాలక సంస్థకు నిధులు రాబట్టాలన్నారు. పాలకవర్గం లేకపోవడం వల్ల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచి పోయాయన్నారు. అదేవిధంగా 21 ఏళ్ళ కార్పొరేషన్ చరిత్రలో కేవలం 2 సార్లు మాత్రమే ప్రజా పాలన సాగిందన్నారు. గతంలో 7 సంవత్సరాలు, ప్రస్తుతం 4 సంవత్సరాలు మొత్తంగా నగరంలో 11 ఏళ్ళ పాటు ప్రత్యేక అధికారుల పాలనే సాగిందన్నారు. భారత రాజ్యాంగ 74వ సవరణ కాకినాడ నగరంలో నిర్లక్ష్యం చేయబడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు క్రమం తప్పకుండా 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు, స్థానిక ప్రభుత్వమైన కార్పొరేషన్ కు ఎందుకు సకాలంలో ఎన్నికలు జరగడం లేదని ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలు చిత్తశుద్ధిగా కృషి చేసి తక్షణమే నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి, ప్రజా పాలన సాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు నాగాబత్తుల సూర్యనారాయణ, డి. ప్రసాద్ లతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, కె. చిట్టిబాబు, సిహెచ్. విజయ్ కుమార్, వి. శ్రీనివాస్, ఆవుల కాశీ, లంకే ధర్మ, ఎస్. సోమరాజు, అప్పన్న, షఫీఖాన్, భాగ్యలక్ష్మి , టి. గంగాధర్, ఎం. ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ నగర పాలక సంస్థకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం ధర్నా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 05:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)