శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సూపర్ సిక్స్ అంటే పథకాలు కాదు.. ధరల పెంపు..

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 10:44 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ధరల పెరుగుదలపై సిపిఎం ధ్వజం

- మోడీ భజన తప్ప ప్రజల కష్టాలు పట్టని కూటమి..

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : ఎన్నికల సమయంలో పన్నులు, ధరలు తగ్గిస్తామని, 'సూపర్ సిక్స్' పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు సామాన్యుడి జేబులు కొడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు విమర్శించారు. కృష్ణలంక రాణీగారితోటలో శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా పోరు యాత్ర’లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఎన్నికల వాగ్దానాల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును సిపిఎం తీవ్రంగా ఎండగట్టింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ అంటే పథకాలు కావని, వంటకు కావాల్సిన ఆరు రకాల ముఖ్య వస్తువులైన — బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, వంట నూనెలు, బెల్లం, కూరగాయల ధరలను విపరీతంగా పెంచడమేననన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీలకు ప్రజల కష్టాలు పట్టడం లేదని, కేవలం మళ్లీ సీట్లు ఎలా గెలవాలనే ఆలోచనే ఊందని విమర్శించారు.

హామీల వైఫల్యంపై నిలదీత

పేదలకి పట్టాభిషేకం చేస్తామన్న ప్రభుత్వం, కృష్ణా కరకట్ట మీద నివసిస్తున్న వేలాది మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతోందని సిపిఎం ప్రశ్నించారు. బడా కంపెనీలకు ఇచ్చేందుకు వచ్చే చేతులు, పేదలకు ఇచ్చేందుకు రావా అని నిలదీసింది. మహిళలకు నెలకు ₹1500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, గత రెండున్నరేళ్లుగా ఇస్తామంటున్న పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియపై స్పష్టత లేకపోవడాన్ని తప్పు పట్టారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికే రాష్ట్ర నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.

రూ. 500 కోట్ల ఎన్నికల వ్యాపారం...

ప్రస్తుత ఎన్నికలు సేవలా కాకుండా వ్యాపారంగా మారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిత్వానికి రూ.50 కోట్లు, కార్పొరేటర్ అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.2 నుండి రూ.3 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని, మొత్తంగా నగరంలో రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు కూటమి నేతలు ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి గెలిచిన వారు, రేపు ప్రజల నుండి 'అనధికారిక పన్నుల' రూపంలో ఆ డబ్బును వసూలు చేస్తారని, ఇప్పటికే ఇల్లు కట్టుకునే సామాన్యులను పీడించి లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

కమ్యూనిస్టులకే ఓటు వేయాలని పిలుపు...

గతంలో విజయవాడ నగరంలో చెత్త పన్ను, నీటి మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడి అడ్డుకున్నది సిపిఎం మాత్రమేనని, నగర అభివృద్ధి, పేదల సంక్షేమం కేవలం కమ్యూనిస్టులతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు వేసే రెండు ఓట్ల ద్వారా కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు తమ నిరసనను, ఆగ్రహాన్ని తెలియజేయాలని, సిపిఎం అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు కార్యదర్శి పి. కృష్ణ, 17వ డివిజన్ కార్యదర్శి టి. చంద్రశేఖర్, సిపిఎం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్