సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వివక్షే బిజెపి అజెండా

4 రోజుల క్రితం

seminar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 12:08 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

• డిఎస్‌ఎంఎం జాతీయ ఉపాధ్యక్షులు సుభాషిణి అలీ

• ఆర్థిక సమానత్వంతోనే సామాజిక న్యాయం

• దళిత గిరిజనుల సమస్యలపై డిసెంబర్ లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం : వి. శ్రీనివాసరావు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కుల,లింగ వివక్షలను కొనసాగించడమే బిజెపి పాలన అజెండా అని దళిత శోషణ్‌ ‌ముక్తి మంచ్‌(డిఎస్‌ఎంఎం) జాతీయ ఉపాధ్యక్షులు సుభాషిణి అలీ అన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్‌), అంబేద్కర్‌ ‌పూలే విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ ఆధ్వర్యాన బుధవారం సాయంత్రం అంబేద్కర్‌ ‌పూలే భవన్లో కులం, మతం, సామాజిక న్యాయం అనే అంశంపై సెమినార్‌ ‌నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సుభాషిణి అలీ మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బిజెపి ప్రభుత్వం కుల వ్యవస్థను అమలు చేయాలన్న అజెండాలో భాగంగానే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనువాద, మతోన్మాద విధానాలను అమలు చేస్తోందని చెప్పారు.

మహిళలను పూర్తిగా వ్యతిరేకించే స్వామి నారాయణ్‌ ‌గురుకుల్‌ ‌ఫ్రాన్స్‌‌లో ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవంలో తలమునకలైన ప్రధాని మోడీ అదే రోజు ఢిల్లీలో భవనం కూలిపోయి ఐదుగురు విద్యార్థులు చనిపోతే కనీసం స్పందించలేదన్నారు. స్వామి నారాయణ్‌ గురుకుల్‌ ‌ప్రతినిధులు ఈఫిల్‌ ‌టవర్‌ ‌చూసేందుకు వెళ్లి అక్కడ మహిళలు ఉండకూడదని ఆంక్షలు పెట్టారని, దీనిపై అక్కడి ప్రభుత్వం ఆలస్యంగా తప్పు తెలుసుకుని తీవ్రంగా స్పందించిందని పేర్కొన్నారు. ఇదే స్వామి నారాయణ్‌‌ గురుకుల్‌ ‌సంస్థ తమ సంస్థలు, దేవాలయాల్లోకి దళితులు రాకూడదని సుప్రీం కోర్టులో కేసు వేసిందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తిగా పూర్తిగా విరుద్ధమైన వ్యవహారమని, అటువంటి సంస్థను మోడీ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందుతూ దానికి వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న ప్రధాని తీరు అత్యంత వివక్షాపూరితమైందని అన్నారు. పాత ఛాందస భావాలను అమలు చేస్తూ లింగ, సామాజిక వివక్ష పాటించేవారిని భారత రాజ్యాంగ ప్రకారం అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి మద్దతుగా నిలవడంతోపాటు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్యానికి పూర్వం దేవాలయ ప్రవేశం కోసం గాంధీజీ, పెరియార్‌, ఎకె గోపాలన్‌ ‌లాంటివాళ్లు పోరాడారని, అంబేద్కర్‌ ‌కూడా నాసిక్‌ ‌లో దేవాలయ ప్రవేశం కోసం పోరాడారని తెలిపారు. దేవాలయ ప్రవేశం అంటే రాజ్యాంగం కల్పించిన సామాజిక హక్కని అన్నారు. యుపిలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఘర్‌ ‌వాపసీ అనే పేరుతో కుల, మత వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. సామాజిక వివక్షను ఎదుర్కోలేక అనేక మంది మతం మారితే మరలా వారిని వెనక్కు తీసుకువచ్చి వివక్షను పాటించే కుల చట్రంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. 1920లో ఆర్య సమాజం ఏర్పాటు చేసి మతం మారిన వారందరూ వెనక్కు రావాలని కోరిన విధంగానే ఘర్‌ ‌వాపసీ ఉందని తెలిపారు. క్రిస్టియన్‌, ముస్లిం అన్ని మతాల్లోనూ లింగ వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆర్థిక సమానత్వం లేకుండా సామాజిక న్యాయం, లింగ సమానత్వం అనేది సాధ్యం కాదని తెలిపారు. 1949లో రాజ్యాంగ పరిషత్‌ ‌రూపొందించిన రాజ్యాంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రతినిధిగా ఉన్న గోల్వాల్కర్‌ ‌వ్యతిరేకించారని, మనుస్మృతిని అమలు చేయాలని కోరారని, ఇప్పుడు బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ మనుస్మృతిని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థతోపాటు న్యాయవ్యవస్థను కూడా అదుపులోకి తీసుకుని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ కూడా ఖరీదైందని, నీట్‌ ‌లాంటి పరీక్షలు సామాన్యులు రాయలేని విధంగా మారిపోయాయని పేర్కొన్నారు. అవి కూడా ఆర్థికంగా బలం ఉన్నవారి చేతుల్లోకే పోతున్నాయని, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకు, ఉన్నత స్థానాల్లోకి వెళ్లేందుకు అవకాశం లేని విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేశారని అన్నారు. నీట్‌ ‌కోచింగ్‌ అనేది పెద్ద వ్యాపారమని తెలిపారు.

శుత్రువులెవరో, మిత్రులెవరో గుర్తించాలి : వి.శ్రీనివాసరావు

సామాజిక న్యాయానికి మిత్రులెవరో శుత్రువులెవరో గుర్తించాలని అంబేద్కర్‌ పూలే విజ్ఞాన కేంద్రం ట్రస్టు కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం స్పందించి దళితుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఏడాది డిసెంబర్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయపడతామని హెచ్చరించారు. కుల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దోచుకునేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న టిడిపి, వైసిపి రెండు పార్టీలూ కార్పొరేట్‌ ‌సంస్థల పట్ల ఒకే వైఖరి అనుసరిస్తున్నాయని తెలిపారు. వేర్వేరు అంశాలమీద పరస్పర విమర్శలు చేసుకుంటూ ఒక పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలు మరొక పార్టీ రద్దు చేస్తూ ఇళ్లు నిర్మించకుండా నిలిపేస్తున్నారని, అదే సమయంలో కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం లోనూ పేదల అసైన్డ్‌ ‌భూములు కట్టబెట్టడం లోనూ ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్పొరేట్లకు ఇచ్చిన జిఓలను మాత్రం తూచ తప్పకుండా పాటిస్తున్నాయని విమర్శించారు. భూమిలేని దళితులకు భూమి ఇవ్వాలన్న కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను మాత్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కులాలు, ఉప కులాల పేరుతో ప్రజలను చీలుస్తున్నారని అన్నారు. అకివీడులో దళితవాడలో ఉన్న గొంతెనమ్మ దేవాలయాలన్ని పూర్తి దురహంకారంతో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పోలీసులు వేధింపుల్లో చనిపోతున్న వారందరూ దళిత, గిరిజన, వెనుకబడిన కులాలవారేనని, చిన్న చిన్న కారణాలకే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, కోట్లు ఎగ్గొట్టిన అగ్రకులాల వ్యక్తులను మాత్రం పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని విమర్శించారు. సామాజిక శంఖారావం పేరుతో నిర్వహించిన సర్వేలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్న విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా అన్ని సంఘాలూ, వ్యక్తులూ ఏకమై పోరాడటం ద్వారానే సామాజిక, కుల వివక్షను తరిమికొట్టొచ్చని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ ఇప్పటికీ రాష్ట్రంలో రెండుగ్లాసుల పద్దతి ఉందని, క్షవరం కూడా చేయడం లేదని, దళితులకు శ్మశానవాటికలు లేవని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన కెవిపిఎస్‌ ‌రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపట్ల వివక్ష ఇంకా కొనసాగుతోందని అన్నారు. తొలుత వ్యక్తలను కెవిపిఎస్‌ ‌నాయకులు క్రాంతికుమార్‌ ఆహ్వానించగా, రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లమ్మ వందన సమర్పణ చేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు అభ్యుదయ గీతాలు ఆలపించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్