సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇప్పటికిప్పుడే గ్రామాలు ఖాళీ చేయలేం

1 గంట క్రితం

velugonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కలెక్టరేట్ ను ముట్టడించిన 'వెలిగొండ` నిర్వాసితులు

- అరకొర పరిహారమే ఇచ్చారని బైఠాయింపు

ప్రజాశక్తి- మార్కాపురం : అరకొర పరిహారం ఇచ్చి ఇప్పటికిప్పుడే గ్రామాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత పోరాట సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. లాఠీలతో అడ్డువచ్చిన పోలీసులను లెక్క చేయకుండా కలెక్టరేట్ గేట్లను తోసేసుకుంటూ లోనికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కొందరిపై లాఠీలు ఝులిపించినా లాఠీ దెబ్బలను తింటూనే కలెక్టరేట్ ప్రాంగణంలోకి చేరుకున్నారు. అక్కడ గంటల తరబడి ఎర్రని ఎండలో బైఠాయించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని చుట్టుముట్టి తమ సమస్యలను వివరించారు. ఈ ఆందోళనకు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత పోరాట సంఘం కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య, కో-కన్వీనర్ గాలి వెంకటరామిరెడ్డి నాయకత్వం వహించారు.

24వ తేదీలోగా గ్రామాలను ఖాళీ చేయాలని చెప్పడం దుర్మార్గం : డి.రమాదేవి

నిర్వాసితుల ఆందోళనకు సంఘీభావంగా హాజరైన ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.రమాదేవి మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండానే ఈ నెల 24వ తేదీ నాటికి గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు. గ్రామా లను ఖాళీ చేసే విషయం ఆరు నెలల ముందుగా చెప్పాల్సి ఉందని తెలిపారు. హుటాహుటిన ఎలా వెళ్లగలమని నిర్వాసితులు ప్రశ్నిస్తే... 'పరదాలు కట్టుకొని ఉండండి. ఎవరైనా బంధువుల ఇళ్లకు వెళ్లండి` అంటూ అధికారులు చెబుతుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలు అదేవిధంగా పరదాలు కట్టుకొని ఒక్క రోజైనా ఉండగలరా? అని ప్రశ్నించారు. 2019 నుండి ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారిలో కొందరు వివాహాలు చేసుకుని భార్యాబిడ్డలతో కుటుంబాలుగా ఏర్పడ్డారని, అలాంటి వారందరూ ప్యాకేజీ అందక, నివాసానికి గూడు లేక, ఎక్కడ ఉండాలో తెలియక ఆందోళనతో ఉన్నారని తెలిపారు. వీరే కాకుండా ఆర్ అండ్ ఆర్ లో పేర్లులేని నాలుగు వందల మందికి పైగా ఇంకా ఉన్నారని, అలాంటి వారి సంగతి ఏమీ తేల్చలే దన్నారు. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే అన్ని సమ స్యలూ పరిష్కారం అవుతాయని తెలిపారు. 2019 నాటి ప్రకారం లెక్క కట్టి రూ.12.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించారని, ప్రస్తుతం ఖాళీ చేసే సమ యానికి మరో రూ.6 లక్షలు ఒక్కో నిర్వాసితుడికి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెలిగొండ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను చులకనగా చూస్తుండడం తగదన్నారు. నిర్వాసితులు ఈ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న పంటల సంగతి ఏంటని, పాడి పశువులను ఎక్కడ ఉంచాలని ప్రశ్నించారు. అందరికీ న్యాయం చేయాలని, గ్రామాలు ఖాళీ చేసేందుకు ఆరు నెలలు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కలెక్టర్ తో చర్చలు విఫలం

వెలిగొండ నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్ విజయ సునీతతో పోరాట కమిటీ నాయకులు, పలువురు నిర్వాసిత గ్రామాల పెద్దలు చర్చించారు. గ్రామాలను ఖాళీ చేసేందుకు సమయం ఇచ్చేందుకు కలెక్టర్ అంగీకరించలేదు. దీంతో, చర్చలు విఫలమయ్యాయి. ఇంత తక్కువ సమయంలో ఖాళీ చేయలేమని, తమకు ఆరు నెలల సమయం ఇవ్వాల్సిందేనని నాయకులు తేల్చి చెప్పారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్