- విశాఖ బీచ్ రోడ్డులో నిరసన ప్రదర్శన
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ప్రజలకు నష్టం చేకూర్చే తర్లువాడలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా కోయలిషన్ ఫర్ ఎఐ రెగ్యులేషన్, గ్రీన్ విశాఖతో పాటు పలు పర్యావరణ సంస్థలు ఆదివారం ఉదయం విశాఖ బీచ్ రోడ్డులో నిరసన ప్రదర్శన చేశాయి. ఈ డేటా సెంటర్ వల్ల పర్యావరణం, స్థానిక ప్రజల జీవనాధారాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సదరు సంస్థలు పేర్కొన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణతో పాటు పర్యావరణ ప్రభావ అంచనా (ఇఐఎ), సామాజిక ప్రభావ అంచనా (ఎస్‌ఐఎ) పూర్తయ్యాకే ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేశాయి. ప్రజల డిమాండ్లను పరిష్కరించే వరకూ ప్రాజెక్టును నిలిపివేసి, ప్రభావిత ప్రజలతో సమగ్రంగా చర్చించాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరాయి. విశాఖ పర్యావరణ పరిరక్షణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా కోయలిషన్ ఫర్ ఎఐ రెగ్యులేషన్ ప్రతినిధి దీక్ష వంగూరు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి భారీ ప్రాజెక్టులను అమలు చేయడం సరికాదన్నారు. పర్యావరణ, సామాజిక ప్రభావాలపై సమగ్ర అధ్యయనం చేసి, ప్రజలతో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. తర్లువాడలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన భూ పరిహారం, తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించి, పారదర్శకంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ విశాఖ అధ్యక్షులు రాజారామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ తర్లువాడలో భూములు కోల్పోతున్న రైతులు, స్థానిక ప్రజల హక్కులను పరిరక్షించాలని, ప్రాజెక్టుపై ప్రజలు వ్యక్తం చేస్తున్న సందేహాలను ప్రభుత్వం నివృతి చేయాలని కోరారు.








కామెంట్‌లు (0)