సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి

1 గంట క్రితం

jac
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 08:48 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- సిఎం మౌనం దేనికి సంకేతం

- ఐక్యంగా పోరాటం ద్వారా హక్కులకు రక్షణ

- ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు

- పోస్టర్‌, కరపత్రాల ఆవిష్కరణ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉద్యోగుల న్యాయమైన హక్కులను సాధించుకునేందుకు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు, సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.40 వేల కోట్లు బకాయిలను సాధించుకునేందుకు రాష్ట్రంలో ఉద్యోగులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఐక్యపోరాటానికి సిద్ధం కావాలని ఎపి జెఎసి అమరావతి నాయకత్వం పిలుపునిచ్చింది. సోమవారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్‌ ‌బొప్పరాజు వెంకటేశ్వర్లు, నాయకులు పలిశెట్టి దామోదరరావు మాట్లాడారు. ఆగస్టు 28న విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో నిర్వహించనున్న ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు సందర్భంగా రూపొందించిన పోస్టర్, ఉద్యోగులు ఎందుకు ఉద్యమానికి వెళ్లాల్సివచ్చిందో తెలియజేసే కరపత్రాలను ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా, వినతిపత్రాలు ఇచ్చినా, చర్చలకు హాజరైనా, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయాలూ పరిష్కారాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల గౌవరవాన్ని పునఃప్రతిష్టంప జేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో చర్చలు పేరుతో కాలయాపనలు చేస్తూ ఉద్యోగుల ఆత్మగౌవరం దెబ్బతిస్తోందని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్యోగుల ముందు దోషులుగా చిత్రికరించే విధంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వమే ఉద్యోగులను భలవంతంగా ఉద్దేశ్యపూర్వకంగా ఉద్యమాల వైపుకు నెడుతోందని బొప్పరాజు అభిప్రాయపడ్డారు. జులై 22న మంత్రివర్గ ఉపసంఘం సమక్షంలో సుదీర్ఘంగా జరిగిన చర్చలపై నెల రోజులు దాటినప్పటికీ ఎలాంటి నిర్ణయాలూ లేవని, కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని, ఇప్పటికైనా, ఉద్యోగులు ఉద్యమానికి నాంది పలకక ముందే, ప్రభుత్వం 22వ తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో జరిగిన చర్చలపై నిర్ణయాలు ప్రకటించాలని కోరారు. జులై 10, 11, 22వ తేదీలలో సమావేశంలో పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం అన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళామని చెప్పారని , సిఎం ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు.

ఐక్య ఉద్యమాలకు సిద్ధం

ఇప్పటికే ఐక్య ఉద్యమాలకు సిద్ధం అని ప్రకటించిన ఎపి ఎన్‌‌జిఓ జెఎసి నాయకులు సమస్యల పరిష్కారానికి వారి ప్రయత్నాలు వారు చేశారని, 22వ తేదీ చర్చల అనంతరం నేటికి ఎలాంటి స్పందనా ప్రభుత్వం నుండి రాలేదని తెలిపారు. ఈ నెల మూడవ వారంలో చర్చలు జరుగుతాయని ప్రకటించినప్పటికీ నేటికి ఎలాంటి నిర్ణయాలు వెలువడలేదని తెలిపారు. అన్ని సంఘాలూ కలిపి గతంలో మాదిరి ఐక్య ఉద్యమ కార్యాచరణ కు కలిసి ముందుకు రావాలని కోరారు. 28వ తేదీన ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించే ఉద్యమ కార్యాచరణ సమయంలో ఏదో ఒక దశలో ఐక్య ఉద్యమ కార్యాచరణకు ఏపీ జేఏసీ అమరావతి సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం, ఇప్పటికే మాకంటే ముందుగానే ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయ జెఎసి కూడా కలిసి ఐక్య ఉద్యమాలు రూపొందించాలని కోరారు.

ఉద్యోగుల సహనాన్ని బలహీనతగా భావించవద్దు

ఉద్యోగులు ఇంతకాలం ఓపిక పట్టింది ప్రభుత్వంపై నమ్మకంతోనేనని, ఆ సహనాన్ని ప్రభుత్వం బలహీనతగా భావించకూడదని పలిశెట్టి దామోదరరావు అన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం పోరుభాట పట్టిన ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మాట్లాడిన అనంతరం జెఎస్‌‌సి జరిపిందని తెలిపారు. సిఎంతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి నెలరోజులు దాటినా అడుగు ముందుకు పడలేదని ఇవన్నీ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినప్పుడే గౌరవం కనిపిస్తుందని అన్నారు. ఉద్యమం కేవలం బకాయిల కోసం చేసే పోరాటం కాదని, ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తు కోసం చేసే పోరాటమని ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు పేర్కొన్నారు. దీనికోసం ఈనెల 28న విజయవాడలో ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటీ ఆద్వర్యంలో జరుగుతున్న "రాష్ట్ర సదస్సు"ను జయప్రధం చేసేందుకు డివిజన్ల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులందరూ ప్రధానంగా పెద్ద సంఖ్యలో మహిళా ఉధ్యోగులు తరలివచ్చి ప్రభుత్వానికి ఉద్యోగుల ఐక్యతను, ఆవేదనను తెలియజేయాలని ఏపి జేఏసి అమరావతి మహిళావిభాగం స్టేట్ చైర్ పర్సన్ పి.లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజలక్ష్మి విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో నాయకులు తిమ్మసర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్