- రెండేళ్లుగా అమలు కాని సిఎం హామీ
ప్రజాశక్తి - కడప ప్రతినిధి : అన్నమయ్య జిల్లాలో టమోటా పల్ప్ పరిశ్రమ ఏర్పాటు ఎప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లాలో టమోటా పల్ప్ పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితమైంది. జిల్లాలోని మదనపల్లి, పీలేరు, పుంగనూరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో 59,120 ఎకరాల్లో టమోటా పంట సాగవుతోంది. ఏటా ఖరీఫ్ సీజన్లో 19,760 ఎకరాలు, రబీ సీజన్లో 29,640 ఎకరాలు, వేసవి సీజన్లో 9,980 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 20 టన్నుల చొప్పున హెక్టారుకు 50 టన్నుల మేర ఏటా 11.82 లక్షల టన్నుల దిగుబడి లభిస్తోంది. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి చెన్నయ్, బెంగళూరు నగరాలకు సమాన దూరంలో ఉంది. ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, యుపి, బిహార్ వంటి ప్రాంతాలకు టమోటా ఉత్పత్తులు ఎగుమతి అవుతోంది. ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఎగుమతి సమయంలో కిలో రూ.40 నుంచి రూ.60 వరకు ధర లభిస్తోంది. ఎగుమతులు తగ్గిన...ఎగుమతులు లేని సమయాల్లో కిలో ధర ఒక రూపాయికి పడిపోయిన పరిస్థితులు ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తమను ఆదుకోవాలని టమోటా రైతులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో టమోటా పల్ప్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా హామీ కాగితాలకే పరిమితమైంది తప్ప, పల్ప్ పరిశ్రమ మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావన
తాజాగా గత సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో మదనపల్లి ఎంఎల్ఎ షాజహాన్ బాషా దీనిపై ప్రస్తావించారు. పల్ప్ పరిశ్రమలు ఏర్పడితేగానీ టమోటా రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితిని వివరించారు. కానీ ఇంత వరకు స్పందన లేదు. ఇప్పటికైనా జిల్లా రాజకీయ నాయకత్వం టమోటా పల్ప్ పరిశ్రమ ఏర్పాటుకు చొరవ తీసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పరిశ్రమ ఏర్పాటుకు కృషి
జిల్లాలో టమోటా పల్ప్ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పిపిపి మోడ్ కింద ఎవరికైనా ముందుకు వస్తే పరిశ్రమ ఏర్పాటు చేస్తాం.
- కె.సుభాషిణి, హార్టీకల్చర్ అధికారి అన్నమయ్య జిల్లా
పల్ప్ పరిశ్రమ హామీని నిలబెట్టుకోవాలి
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని అమలు చేయాలి. పరిశ్రమ ఏర్పాటుతో టమోటా రైతుకు ధరల పతనం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
సాయిచరణ్, రైతు,
కొత్తపల్లి గ్రామం, బి.కొత్తకోట మండలం అన్నమయ్య జిల్లా







కామెంట్‌లు (0)