బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసు నిర్బంధాలపై వామపక్షాల ఆగ్రహం

3 రోజుల క్రితం

left
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 12:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- లెనిన్ సెంటర్ లో వామపక్షాల నిరసన

- సిఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్

ప్రజాశక్తిఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి: ఢిల్లీ, విజయవాడలలో విపక్షాలు, విద్యార్థి సంఘాలపై జరిగిన పోలీసు నిర్బంధాలను నిరసిస్తూ ఆదివారం విజయవాడ లెనిన్ సెంటర్ వేదికగా వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేశారు. సిపిఎం నేత రమణ అధ్యక్షత వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'సర్' ప్రక్రియ పేరుతో ఓట్లను అక్రమంగా తొలగించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేంతవరకు లేదా మోడీ ప్రభుత్వం దిగిపోయేంతవరకు దేశవ్యాప్తంగా యువత పోరాటం ఆపదన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాలతో ఇక్కడి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలు, విద్యార్థులపై పోలీసు దాడులు చేయిస్తోందని ఆరోపించారు. పూలే అంబేద్కర్ భవనంలోకి మగ పోలీసులు చొరబడి, విద్యార్థినులను గదుల నుండి బలవంతంగా లాక్కొచ్చి అరెస్ట్ చేయడం దారుణమన్న ఆయన, రాష్ట్రంలో ప్రస్తుతం 'పోలీసు రాజ్యం' నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ నగర అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ.. 'సర్' ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఏకపక్ష నిర్ణయానికి బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలతో లాఠీఛార్జీలు చేయించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. న్యూడెమోక్రసీ నేత రామకృష్ణ మాట్లాడుతూ... ఢిల్లీలో 35 వేల మంది అదనపు బలగాలను పెట్టి, ఇంటర్నెట్, మెట్రో సేవలను నిలిపివేసినా సరే, అక్టోబర్ 20 నిరసన గత జులై నాటి కంటే 20 రెట్లు తీవ్రమైన ప్రతిఘటనను చూపిందని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియనే మార్చి బిజెపి రాజ్యాంగాన్ని ఘోరంగా ఉల్లంఘిస్తోందని సిపిఐ (ఎంఎల్) నేత కిషోర్ బాబు విమర్శించారు. ఎస్‌యుసిఐ నేత సుధీర్, ఎంసిపిఐ(యు) నేత కాదర్ బాషా, న్యూడెమోక్రసీ నేత ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులకు వచ్చి మరీ పోలీసులు అక్రమ అరెస్టులు చేయడాన్ని అత్యంత ఫాసిస్టు చర్యగా ఖండించారు. మోదీ, అమిత్ షాల ద్వయం అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ నాయకులు వై. వెంకటేశ్వరరావు, సిహెచ్. బాబురావు, రాంభూపాల్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రి, వామపక్ష పార్టీల నాయకులు, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్