మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒడిశా వద్దు...ఆంధ్రాయే ముద్దు

16 నవంబర్, 2026

ఒడిశా వద్దు...ఆంధ్రాయే ముద్దు 
- ప్రజాశక్తి వరుస కథనాలతో కదిలిన కొటియా గ్రామాలు
- ఒడిశా పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం
- ఆంధ్రా పోలీసులు భద్రత కల్పించాలి
- మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజనుల ధర్నా
-జెసి, ఎస్‌పిలకు వినతిపత్రాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 09:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రజాశక్తి వరుస కథనాలతో కదిలిన కొటియా గ్రామాలు

- ఒడిశా పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం

- ఆంధ్రా పోలీసులు భద్రత కల్పించాలి

- మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజనుల ధర్నా

-జెసి, ఎస్‌పిలకు వినతిపత్రాలు

ప్రజాశక్తి-పార్వతీపురం : ఒడిశా వద్దు.. ఆంధ్రాయే ముద్దంటూ వివాదాస్పద కొటియా గ్రామాల గిరిజనులు ముక్తకంఠంతో నినదించారు. ఆటోలు, జీపులు, ద్విచక్ర వాహనాలతో సుమారు 200 మంది వివాదాస్పద గిరిజన గ్రామాల ప్రజలు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఒడిశా పోలీసుల దౌర్జన్యం, వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, గతంలో మాదిరిగా ఆంధ్ర పోలీసులు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కొటియా గిరిజన నాయకులు, మాజీ సర్పంచులు బచ్చల ప్రసాదరావు, గెమ్మెల భీషు, చోడిపిల్లి భీషు, గెమ్మెల సుబ్బారావు నాయకత్వంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. గత కొద్దిరోజులుగా కొటియా గ్రామాల సరిహద్దు వివాదం, ఒడిశా ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలు, ఎపి ప్రభుత్వ ఉదాసీన వైఖరి, గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజాశక్తి వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలు కొటియా గ్రామాల్లో కదలికను తీసుకొచ్చాయి. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా ప్రజాప్రతినిధులు, పోలీసులు, అధికారులు యథేచ్ఛగా దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతుండటంతో, వాటిని తట్టుకోలేని గిరిజనులు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత వైఖరిని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. తమకు భద్రత కల్పించాలని కోరుతూ కొటియా గ్రామాల గిరిజనులు మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ వైశాలి, ఎస్‌పి మాధవరెడ్డి లకు వినతిపత్రాలు అందజేశారు. జెసి వైశాలి గిరిజన నాయకులతో తన ఛాంబర్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు బచ్చల ప్రసాదరావు మాట్లాడుతూ.. 2021 నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఒడిశా పోలీసులు, అధికారుల వేధింపులు అధికమయ్యాయని, ఇళ్ళల్లోకి చొరబడి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను తిరస్కరించామని, రేషన్, పింఛను, ఆధార్ కార్డులను సరెండర్ చేశామని తెలిపారు. ఎపి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, వైద్యం, ఇతర సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. మాజీ సర్పంచులు గెమ్మెల భీషు, చోడిపిల్లి బీషు మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికల్లో పాల్గొనవద్దని ఒడిశా పోలీసులు, అధికారులు దౌర్జన్యం చేస్తే ఎపి పోలీసులు, అధికారులు ఘాటుగా స్పందించారని, ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సహకరించారని చెప్పారు. ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం హయాంలో పోలీసులు, అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. గిరిజన నాయకుడు వంతల లక్ష్మణరావు మాట్లాడుతూ... రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు పాత పద్ధతిలోనే పంచాయతీ కేంద్రాలలో నిర్వహించేలా చూడాలని, అందుకు తగిన భద్రత కల్పించాలని కోరారు.

ఒడిశా తీరు అభ్యంతరకరమే

కొటియా గ్రామాల వ్యవహారంలో ఒడిశా అధికారులు, పోలసులు అనుసరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని జెసి వైశాలి చెప్పారు. ఈనెల రెండున స్థానిక ఎన్నికల నిర్వహణపై ఒడిశా పోలీసులు, కొరాపుట్ సబ్ కలెక్టర్ తో చర్చించేందుకు నేరెళ్ళవలస వెళ్ళినప్పుడు వారు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్నారు. పాకిస్తాన్ వారిని చూసినట్లు కొరాపుట్ జిల్లా సబ్ కలెక్టర్, పోలీసులు బెదిరింపు ధోరణి లో మాట్లాడారని చెప్పారు. ఒడిశా పోలీసు ఎకె 47 తుపాకీ చూపించి బెదిరించే యత్నం చేశారని, అన్ని ఆధారాలతో ఒడిశా అధికారులు, పోలీసుల తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్‌టి కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. స్టేటస్ కో ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ ఒడిశా దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. జిల్లా ఎస్‌పితో మాట్లాడి భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని జెసి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్