- స్వతంత్ర, సమగ్ర పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు పూర్తయ్యే వరకూ నిలిపివేయాలి
- ‘విశాఖపట్నం డిక్లరేషన్’ ప్రకటన
- ప్రజావనరుల ధారాదత్తంపై జాతీయ స్థాయి ప్రజా సదస్సులో తీవ్ర అభ్యంతరాలు
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : స్వతంత్ర, సమగ్ర పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు పూర్తయ్యే వరకూ ఎఐ డేటా సెంటర్లకు ఎలాంటి అనుమతులూ మంజూరు చేయకూడదని ‘విశాఖపట్నం డిక్లరేషన్’ తేల్చిచెప్పింది. విశాఖపట్నంలో ప్రతిపాదిత ఎఐ డేటా సెంటర్ల నేపథ్యంలో పర్యావరణం, ప్రజావనరులు, భూ హక్కులు, విద్యుత్, నీటి వినియోగం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సంబంధించి పలు కీలక డిక్లరేషన్‌ను ప్రకటించారు.గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జాతీయ స్థాయి ప్రజా సదస్సు జరిగింది. డేటా సెంటర్లకు సంబంధించిన ఎంఒయులు, ఎన్‌డిఎలు, భూ కేటాయింపులు, విద్యుత్, నీటి సరఫరా, సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ రాయితీల పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సదస్సులో డిక్లరేషన్‌ను ఆమోదిం చారు. వివరాలను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అధికారికంగా ప్రచురించాలని కోరారు. పర్యావరణ ప్రభావ అంచనా, అవసరమైన ప్రజాభిప్రాయ సేకరణ వంటి చట్టపరమైన ప్రక్రియలను పాటించకుండా ఇచ్చిన అనుమతులను సమీక్షించి, అవి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే రద్దు చేయాలని ఈ డిక్లరేషన్ డిమాండ్ చేసింది. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కారణంగా గ్రిడ్‌పై పడే ప్రభావం, టారిఫ్‌ల భారం, పోలవరం నీటి బడ్జెట్‌పై ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించాలని కోరింది. ఈ మేరకు ప్రజాప్రతినిధులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి విద్యుత్, నీటి వనరులపై ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. డేటా సెంటర్ల పేరుతో దళితుల, ఆదివాసీల, చిన్న రైతుల భూములను బలవంతంగా సేకరించడాన్ని నిలిపివేయాలని, ప్రభావిత ప్రజల భూ హక్కులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. డిజిటల్ సెన్సార్‌షిప్, నిఘా చర్యలు, శాంతియుత నిరసనలను నేరపూరిత చర్యలుగా పరిగణించే విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కును, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పరిరక్షించాలని కోరింది.
ఎఐ డేటా సెంటర్లపై తీవ్ర అభ్యంతరాలు
విశాఖ పరిసరాల్లో ప్రతిపాదిస్తున్న భారీ ఎఐ డేటా సెంటర్లకు ప్రజల భూములు, నీరు, విద్యుత్‌ను ధారాదత్తం చేసే ముందు ప్రభుత్వం సమగ్రంగా పునఃపరిశీలించాలని జాతీయ స్థాయి ప్రజాసదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. సుమారు 6,500 మెగావాట్ల సామర్థ్యంతో ప్రతిపాదిస్తున్న డేటా సెంటర్ ప్రాజెక్టుల వల్ల స్థానిక నీటి వనరులు, విద్యుత్ వ్యవస్థ, భూములు, పర్యావరణం, సహజ డ్రెయినేజీ, ప్రజల జీవనాధారాలపై పడే ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని కోరారు. ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు, భూముల కేటాయింపులు, నీరు–విద్యుత్ సదుపాయాలు, స్థానికులకు లభించే ఉపాధి వంటి అంశాలపై పూర్తి సమాచారాన్ని ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి, పెట్టుబడులకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రజావనరులు, పర్యావరణాన్ని పణంగా పెట్టి అభివృద్ధి చేపట్టడం సరికాదన్నారు.
సమగ్ర వాటర్ ఆడిట్ అవసరం : రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇఎఎస్.శర్మ
తొలుత రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇఎఎస్.శర్మ మాట్లాడుతూ విశాఖలో ఇప్పటికే తాగునీటి అవసరాలు, నీటి వనరులపై ఒత్తిడి ఉన్న నేపథ్యంలో భారీ డేటా సెంటర్లకు నీటి కేటాయింపులపై ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. నగర తాగునీరు, సాగునీటి అవసరాలు, భవిష్యత్ జనాభా పెరుగుదల, పారిశ్రామిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్ర సంస్థతో సమగ్ర వాటర్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. పోలవరం, స్థానిక రిజర్వాయర్ల నుంచి ప్రజల అవసరాలకు కేటాయించిన నీటిని డేటా సెంటర్లకు మళ్లించే నిర్ణయం ఉంటే దానిని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. ముందుగా ప్రజల తాగునీటి భద్రతకు హామీ ఇచ్చిన తర్వాతే భారీ పారిశ్రామిక ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డేటా సెంటర్లకు అందిస్తున్న రాయితీల పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా స్థానికులకు ఎన్ని ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు అందించే భారీ రాయితీలను ఉత్తరాంధ్రలో సాగునీటి కాల్వలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తే ప్రజలకు మరింత ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుందని వివరించారు. తర్లువాడ భూముల విషయంలో బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అనుమతుల విధానంపై అనేక ప్రశ్నలు : మద్రాసు హైకోర్టు న్యాయవాది డి.నాగ శైల
మద్రాసు హైకోర్టు న్యాయవాది డి.నాగ శైల మాట్లాడుతూ డేటా సెంటర్లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన విధానంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. భారీ ప్రాజెక్టులకు పర్యావరణ ప్రభావాలను సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉండగా, ప్రాజెక్టు స్వరూపం, నిర్మాణ విస్తీర్ణం, నీటి వినియోగం, డీజిల్ నిల్వలు వంటి అంశాలపై మరింత స్పష్టత అవసరమని తెలిపారు. భారీ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవ విస్తీర్ణాన్ని తక్కువగా చూపించడం ద్వారా పూర్తిస్థాయి పర్యావరణ ప్రభావ అంచనా నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్న అనుమానాలను పరిశీలించాల్సి ఉందన్నారు. పర్యావరణ అనుమతుల కోసం ప్రాజెక్టును ‘బిల్డింగ్ ప్రాజెక్ట్’గా చూపించి, ఇతర సందర్భాల్లో పారిశ్రామిక డేటా సెంటర్‌గా పేర్కొన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. సాపక్ పరిశోధకులు సాగర్ దారా మాట్లాడుతూ డేటా సెంటర్ల వల్ల సమానత్వం, అభివృద్ధి జరగదన్నారు. వీటికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రజల అభివృద్ధికి దోహదపడని ఈ సెంటర్లు దేనికని ప్రశ్నించారు. పర్యావరణ కార్యకర్త జయశ్రీ హతంగిడి మాట్లాడుతూ ప్రయివేటు వ్యక్తుల లాభాల కోసం చారిత్రక ప్రదేశాలను, కట్టడాలను ప్రభుత్వం నాశనం చేయడం విచారకరమన్నారు. నీటిపారుదల రంగం విశ్రాంత సిఇ యు.నారాయణరాజు మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ నీటిని తాగు, సాగునీటికి సరఫరా చేయకుండా, డేటా సెంటర్లకు ప్రాధాన్యత ఇవ్వడం సముచితం కాదన్నారు. మానవ హక్కుల వేదిక తెలుగు రాష్ట్ర్రాల ప్రతినిధి విఎస్.కృష్ణ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలే అభివృద్ధి పేరుతో పర్యావరణంపై ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ ప్రజల వనరులు, ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్లకు ప్రభుత్వం కట్టబెట్టడం ఆపకపోతే భవిష్యత్తులో ప్రజలు తీవ్ర నష్టాలు అనుభవించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ వనరుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ విశాఖ గౌరవాధ్యక్షులు విశ్రాంత ప్రొఫెసర్ భైరాగిరెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు రాజారామ్మోహన్ రాయ్, డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, కంటెంట్ క్రియేటర్ రాడికల్ అజయ్, స్వేచ్ఛ సంస్థ ప్రతినిధి శ్రీపత్ రాయ్, పెద్ద సంఖ్యలో పర్యావరణ కార్యకర్తలు, యువత, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజాదర్బార్‌లో అందరూ చేతులెత్తి ప్రజలకు నష్టం చేసే డేటా సెంటర్లు వద్దని నిరసన తెలిపారు.








కామెంట్‌లు (0)