సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెత్త మధ్య పుస్తకాల పరిమళం..

1 గంట క్రితం

books
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 04:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

చుట్టూ చెత్త.. పాడైపోయిన ఇనుము, ప్లాస్టిక్‌ వస్తువులు.. వాటి మధ్య ఓ చిన్న ‘పుస్తకాల మూల’. చూడగానే ఆశ్చర్యం కలిగించే దృశ్యమిది. కానీ కేరళ కొట్టాయం జిల్లా చిరక్కడవు జంక్షన్‌ వాసులకు మాత్రం ఇది సుపరిచితం. అక్కడ 79 ఏళ్ల టి.జి. శ్రీధరన్‌ పిళ్లై నిర్వహించే స్క్రాప్‌ దుకాణంలో చెత్తతో పాటు పుస్తకాలకు కూడా కొంత చోటు ఇచ్చారు. మూడున్నర దశాబ్దాలుగా తన వద్దకు వచ్చిన పాత పుస్తకాలను భద్రపరచడం పిళ్లై అలవాటు చేసుకున్నారు. వీలున్నప్పుడల్లా వాటిని చదువుతూ.. అవసరమైన వారికి అందిస్తూ వస్తున్నారు. ఇటీవల పబ్లిక్‌ ‌లైబ్రేరీకి 800 పుస్తకాలను దానం చేసి పుస్తకాలపై తనకున్న అపారప్రేమను చాటుకున్నారు.

పొన్నకున్నమ్‌ కంతలంకలపాడిలో నివసించే పిళ్లై సుమారు 30 ఏళ్ల క్రితం రకరకాల వ్యాపారాలు చేసి నష్టపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో స్క్రాప్‌ సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇళ్లను ఖాళీ చేసేవారు, ఊర్లు మారేవారు తమతో తీసుకెళ్లలేని పాత పుస్తకాలను ఇతర చెత్తతో పాటు ఆయనకు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా వచ్చిన పుస్తకాలను స్క్రాప్‌గా అమ్మేయడం పిళ్లైకు నచ్చేది కాదు. ఆసక్తిగా అనిపించిన పుస్తకాలను ముందుగా చదివేవారు. అనంతరం వాటిని జాగ్రత్తగా దాచిపెట్టేవారు. అలా కొన్నేళ్లలో వందలాది పుస్తకాలు ఆయన వద్ద పోగయ్యాయి. అలా సేకరించిన మలయాళం, ఇంగ్లీష్‌, హిందీ, అరబిక్‌ భాషల్లోని పుస్తకాలను ప్రత్యేకంగా విభజించి దుకాణంలోని ఓ మూలలో అందంగా సర్దడం మొదలుపెట్టారు.

రోడ్డు పక్కనే దుకాణం ఉండటంతో రోజూ అక్కడి నుంచి వెళ్లేవారి దృష్టి పుస్తకాలపై పడేది. రోజు కూలీలు, స్థానికులు ఆసక్తితో పుస్తకాలను కొనడం మొదలుపెట్టారు. ఒక్కో పుస్తకాన్ని పిళ్లై రూ.10 నుంచి రూ.50కే ఇచ్చేవారు. ఆ డబ్బులు కూడా లేవని ఎవరైనా చెబితే ఉచితంగా ఇచ్చేసేవారు. పుస్తకాలను అమ్మడానికి ముందు వాటిని చదవడం మాత్రం ఆయనకు ఇప్పటికీ అలవాటే. ముల్లా కథల నుంచి నవలల వరకు ఆయన చదివిన పుస్తకాల్లో ఎన్నో ఉన్నాయి.

800 పుస్తకాలు విరాళం

ఇటీవల చిరక్కడవు పబ్లిక్‌ లైబ్రరీ పాత పుస్తకాలను దానం చేయాలని కోరుతూ ప్రకటన ఇచ్చింది. అది చూసిన పిళ్లై వెంటనే లైబ్రరీ నిర్వాహకుడు వి.టి. రాజేష్‌కు ఫోన్‌ చేశారు. తన వద్ద ఉన్న పుస్తకాలను తీసుకెళ్లాలని కోరారు. పిళ్లై దుకాణానికి వెళ్లిన రాజేష్‌ అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చెత్త మధ్య పుస్తకాలను ఎంతో క్రమబద్ధంగా భద్రపరిచిన తీరు రాజేష్‌ ‌ను ఆకట్టుకుంది. ‘పుస్తకాలపై ప్రేమ ఉన్నవారే ఇలాంటి పని చేయగలర’ని పిళ్లైను అభినందించారు కూడా! అనంతరం పిళ్లై తన దగ్గర ఉన్న 800 పుస్తకాలను లైబ్రరీకి ఉచితంగా అందించారు. చిరక్కడవు పబ్లిక్ లైబ్రరీకి 75 ఏళ్ల చరిత్ర ఉంది. 1,200 మందికి పైగా సభ్యులు, సుమారు 18 వేల పుస్తకాలు ఉన్నాయి. అయితే లైబ్రరీకి ప్రస్తుతం వచ్చే పాఠకులు గణనీయంగా తగ్గిపోయారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. కొత్త పుస్తకాల సేకరణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే పిళ్లై తన దగ్గర ఉన్న పుస్తకాలను ఉచితంగా ఇచ్చేశారు.

పుస్తకాలను దానం చేయడం పిళ్లైకు ఇదే తొలిసారి కాదు. 2018లో వచ్చిన వరదల్లో పుస్తకాలు కొట్టుకుపోయిన ఓ గ్రంథాలయానికి తన వద్ద ఉన్న 200 పుస్తకాలను అందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలోనూ 300 పుస్తకాలను ఉచితంగా అందించారు. ‘నా దగ్గర ఉన్నప్పటి కంటే గ్రంథాలయంలో ఉంటే ఈ పుస్తకాల విలువ మరింత మందికి చేరుతుంది అన్నదే నా ఆలోచన’ అని పిళ్లై ఇటీవల లైబ్రరీకి పుస్తకాలు ఇస్తూ అన్నారు. దుర్గంధం వెదజల్లే చెత్త మధ్య పుస్తకాల పరిమళాన్ని నలుదిశలా వెదజల్లుతున్న పిళ్లై ఎంతోమందికి ఆదర్శం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్