- ఎంఎస్ఎంఇ పార్కుల పేరిట పచ్చని పొలాలు ధ్వంసం
- ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన
- అరెస్టులతో పుల్లేరుగుడ్డివలసలో ఉద్రిక్తత
ప్రజాశక్తి- రామభద్రపురం : ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములను ఎంఎస్ఎంఇ పార్కు పేరుతో స్వాధీనం చేసుకొని పనులు చేపట్టడానికి అధికారులు బుధవారం ప్రయత్నించారు. దీనిని నిరసిస్తూ విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం పుల్లేరుగుడ్డివలస గిరిజనులు సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు దురుసుగా వ్యవహరించారు. నాయకులను, గిరిజనులను బలవంతంగా అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పుల్లేరుగుడ్డివలసలోని ప్రభుత్వ భూములను ఆ గ్రామ గిరిజనులు తరతరాలుగా సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు కోసమంటూ ఈ భూములను రాధికా వెజిటబుల్ ఇండస్ట్రీకి ప్రభుత్వం కేటాయించింది. ఈ భూముల్లోని పంటలను అధికారులు నాలుగు నెలల క్రితం ధ్వంసం చేశారు. దీనిని అప్పట్లో గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా, ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ముందుకే సాగుతోంది. దీనిలో భాగంగా ఆ భూముల్లో పనులు చేపట్టడానికి అధికారులు వచ్చారు. బొబ్బిలి డిఎస్పీ గోవిందరావు, బొబ్బిలి రూరల్, టౌన్ సిఐలు మల్లికార్జునరావు, నారాయణరావు, రామభద్రపురం,బాడంగి, తెర్లాం ఎస్ఐలు, పోలీసు బలగాలు అప్పటికే మోహరించాయి. తమ జీవనోపాధి అయిన భూములను వదులుకొనేది లేదంటూ అధికారులను సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన గిరిజనులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు దౌర్జన్యంగా పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. నిరుపేద గిరిజనుల హక్కులను కాలరాయడం సమంజసం కాదని, కార్పొరేట్లకు, పెత్తందారులకు ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం కొమ్ముకాయడం తగదని సిపిఎం సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు ఈ భూముల్లో పనులు జరగనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎం.కృష్ణమూర్తి సహా, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు పి.శంకరరావు, సుమారు 50 మంది గిరిజనులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వారిలో కొందరిని బొబ్బిలి పోలీస్ స్టేషన్‌కు, మరికొందరిని తెర్లాం పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.








కామెంట్‌లు (0)