ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్కీం వర్కర్ల కన్నెర్ర

1 రోజు క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 12:35 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

• కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం

• పలుచోట్ల అరెస్టులు - గాయాలు

ప్రజాశక్తి - యంత్రాంగం : కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ స్కీం వర్కర్లు కదం తొక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ర్ట వ్యాప్తంగా కలెక్టరేట్లను అంగన్‌‌వాడీ, వెలుగు విఒఎ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఆశా, శానిటేషన్‌ వర్కర్లు ముట్టడించారు. బకాయి వేతనాలు చెల్లించాలని, టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పిఎఫ్, ఇఎస్ఐ, పెన్షన్, బోనస్, గ్రాట్యూటీ వంటి కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురైతే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, మరణించిన కుటుంబాలకు రూ.పది లక్షలు బీమా కల్పించాలని కోరారు. అనవసరమైన యాప్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అనకాపల్లి కలెక్టరేట్‌‌ను స్కీం వర్కర్లు ముట్టడించారు. కలెక్టరేట్‌‌లోకి వెళ్తున్న స్కీం వర్కర్లను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వెలుగు విఒఎ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.రూపాదేవి, ఎస్.వెంకటలక్ష్మి గాయాలయ్యాయి. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ ‌హెల్పర్స్‌ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ శేషు సహా కొంతమందికి గాయాలయ్యాయి. వీరంతా అనకాపల్లిలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద గంటల తరబడి బైఠాయించినా అధికారులు స్పందించకపోవడంతో బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోలీసులు అడ్డంకులు సృష్టించినా కలెక్టరేట్ కు వేలాదిగా తరలొచ్చారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీలు చేశారు. నేతల కదలికలపై నిఘా పెట్టారు. జామర్లను వినియోగించారు.

పార్వతీపురం ఆర్ టిసి కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకు స్కీమ్‌ ‌వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కు వినతిప్రతం ఇచ్చేందుకు లోపలకు అనుమతించకుండా పోలీసులు గేట్లు మూసివేశారు. ఈ సందర్భంగా నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిఐటియు, పలు ప్రజాసంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చిపడేశారు. నాయకులను, మహిళా నాయకులను అరెస్టు చేసి నగరంలోని పోలీసు స్టేషన్ కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని స్టేషన్ తరలిస్తున్న క్రమంలో అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు సుధ కింద పడిపోవడంతో ఆమె గాయపడ్డారు.

విశాఖ నగరంలో సరస్వతీ పార్క్ నుండి డాబా గార్డెన్స్, ప్రకాశరావుపేట, జగదాంబ సెంటర్, వాచ్ హౌస్ మీదుగా కలెక్టరేట్‌ ‌వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో కలెక్టర్ కాన్వాయ్‌‌ను అడ్డుకున్నారు. అయితే వాహనంలో కలెక్టర్ లేరని తెలియడంతో స్కీం వర్కర్లు యధావిధిగా తమ ధర్నా కొనసాగించారు. కాకినాడలో నిర్వహించిన ధర్నాలో సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు జి.బేబిరాణి పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని రైల్వేస్టేషన్‌ ‌నుంచి ధర్నాచౌక్‌ ‌మీదుగా కలెక్టరేట్‌ ‌వరకూ ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ ‌పాల్గొన్నారు. ఒంగోలులో ప్రకాశం భవనం నుంచి చర్చి సెంటర్ లో మానవహారం నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, శ్రీ సత్యసాయి, ఉమ్మడి కడప, నెల్లూరు, పోలవరం, ఉమ్మడి తూర్పుగోదావరి కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

వేతనాలు పెంచకుండా పనిభారం

ఏలూరులో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ... 2019 నుంచి ఏ ఒక్క స్కీమ్‌ వర్కర్‌కూ వేతనాలు పెరగలేదని తెలిపారు.పైగా పని భారాన్ని పెంచడం పరిపాటిగా మారిందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ ‌కల్యాణ్‌ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో కార్మికులకు 13 నెలలుగా జీతాలు ‌లేని దుస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో కనీస వేతనం రూ.26 వేలు ఉండాలని ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారని చెప్పారు. అనకాపల్లిలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ... కార్పొరేట్లకు, బడా పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఎందుకు అమలు చేయదని నిలదీశారు. విజయవాడలో ధర్నానుద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. సుబ్బరావమ్మ మాట్లాడుతూ... ఆశా, అంగన్వాడీలపై యాప్‌ల పేరుతో పనిభారం పెంచారని, విఒఎలు, ఆర్ పిలకు ఐదునెలలుగా వేతన బకాయిలు చెల్లించలేదని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్లు, స్వచ్ఛంద సంస్థల ప్రవేశాన్ని విరమించుకోవాలని, స్కూల్ శానిటేషన్, నైట్ వాచ్‌మెన్‌ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్