- సోలార్ భూ నిర్వాసితుల రాష్ర్ట సదస్సులో కె ప్రభాకర్ రెడ్డి
- 18న ముఖ్యమంత్రికి, విద్యుత్ శాఖ మంత్రికి సెల్ ఫోన్ల ద్వారా మెసేజ్‌లు పంపాలని సదస్సు పిలుపు
- 24న కలెక్టర్లకు ఆయా జిల్లాల రైతులు ప్రజా దర్బార్ లో అర్జీలు ఇవ్వాలని నిర్ణయం
- పలు తీర్మానాలు ఆమోదం
ప్రజాశక్తి- గుత్తి (అనంతపురం జిల్లా) : పంటలు పండే రైతుల భూములను సౌర విద్యుత్తు ప్రాజెక్టుల పేరుతో సోలార్ కంపెనీలు మింగేస్తున్నాయని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోలార్ కంపెనీల నుంచి రైతుల భూములను కాపాడాలన్న నినాదంతో సోలార్ కంపెనీల మోసపూరిత ఒప్పందాలపై అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ‘సోలార్ బాధిత రైతుల రాష్ట్ర సదస్సు’ ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ నెల 18న ముఖ్యమంత్రికి, విద్యుత్ శాఖ మంత్రికి సెల్ ఫోన్ల ద్వారా రైతులు మెసేజ్‌లు పంపాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది. 24న కలెక్టర్లకు ఆయా జిల్లాల రైతులు ప్రజాదర్బార్ లో అర్జీలు ఇవ్వాలని నిర్ణయించింది. పలు తీర్మానాలను ఆమోదించింది. ముందుగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో రైతులు ప్రదర్శన నిర్వహించారు. ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన గాంధీ కూడలి మీదుగా నిజామి ఫంక్షన్ హాలు వరకు కొనసాగింది. అనంతరం ఆ హాలులో ఎపి రైతు సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సోలార్ కంపెనీలు షరతులతో కూడిన మోసపూరిత ఒప్పందాలతో రైతుల వేల ఎకరాలను కొల్లగొట్టుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలార్ కంపెనీలకు భూములను లీజుకు ఇచ్చిన అనంతరం సమస్యలు తలెత్తితే రైతులు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయి లాంటి ప్రధాన కార్యాలయాలకు వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కంపెనీలకు భూములు లీజుకు ఇవ్వని రైతులపై పోలీసు అధికారులు బెదిరింపులకు దిగుతుండడం గర్హనీయమన్నారు. అన్నదాతల పక్షాన నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు... కంపెనీల పక్షాన నిలబడడం అన్యాయమని తెలిపారు. ప్రజాప్రతి నిధులు వారి భూములను సోలార్ కంపెనీలకు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. రైతులకు కవచకుండలా ఉన్న 2013 భూ సేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి రైతులకు, వ్యవసాయ కార్మికులకు, చేతివృత్తిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి లీజుకు తీసుకున్న భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టే హక్కు కంపెనీలకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
సోలార్ బాధిత రైతుల జిల్లా కమిటీలు ఎన్నిక
సోలార్ కంపెనీలకు భూములు లీజుకు ఇచ్చే విధానంలో సమూల మార్పులు రావాలని, సోలార్ కంపెనీల మోసపూరిత ఒప్పందాలను రద్దు చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించుకోవాలని నిర్ణయించింది. అనంతరం ఆయా జిల్లాల సోలార్ బాధిత రైతుల కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సదస్సులో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, ఉపాధ్యక్షులు రామకృష్ణ, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్ కడప జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ హరి, పెద్దన్న, రామకృష్ణుడు, రాజశేఖర్, దస్తగిరి, గోపాలకృష్ణయ్య, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, ఎపి వృత్తిదారుల సంఘం, సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
తీర్మానాలు
-సోలార్ కంపెనీలు రైతులతో 29 ఏళ్ల 11 నెలల లీజు కాకుండా ఐదేళ్లకు మాత్రమే లీజు ఒప్పందం చేసుకోవాలి
-2013 భూ సేకరణ చట్టం ప్రకారమే భూములను సేకరించాలి. భూ సేకరణలో దళారులు ఉండరాదు
-లీజు కాలంలో భూముల ఒరిజినల్ పత్రాలు కాకుండా జిరాక్స్ పత్రాలను మాత్రమే కంపెనీలు తీసుకోవాలి
-భూములపై రైతులకే పూర్తి హక్కులు ఉండాలి
-సోలార్ కంపెనీలు ఈ భూములపై ఎలాంటి రుణాలు తీసుకోరాదు. రైతులకు మాత్రమే ఆ హక్కు ఉండాలి.
-ఎకరాకు ఏడాదికి రూ.50 వేలు కౌలు ఇవ్వాలి. ప్రతి ఏటా పది శాతం కౌలు పెంచాలి.
-కంపెనీ లాభాల్లో రైతులకు ఏటా 25 శాతం డివిడెండ్ ఇవ్వాలి.
-కంపెనీలు ఐదు శాతం నిధులు గ్రామాభివృద్ధికి కేటాయించాలి.
-భూములు ఇచ్చిన రైతుల కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి.
-సోలార్ పరిశ్రమ ఏర్పాటు చేసిన గ్రామాల్లో ప్రజలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలి
-సోలార్ పరిశ్రమల వల్ల ఉపాధి కోల్పోయే వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి
-సోలార్ కంపెనీకి రైతుకు మధ్య తలెత్తే వివాదాన్ని స్థానిక సివిల్ కోర్టులో పరిష్కరించుకునే అవకాశం రైతులకు కల్పించాలి.








కామెంట్‌లు (0)