ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తాత్కాలిక ఉపాధ్యాయులు, అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలి

1 గంట క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 06:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

– ఏడో రోజుకు చేరిన గురుకుల పార్ట్‌టైమ్ ఉద్యోగుల మహాధర్నా

ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందిని కాంట్రాక్ట్ విధానంలోకి మార్చి, అనంతరం రెగ్యులర్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగులు నిర్వహిస్తున్న మహాధర్నా ఆదివారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహాధర్నాను వి.శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమానికి కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఒకే విద్యాసంస్థల్లో ఒకే రకమైన పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ అంటూ మూడు రకాలుగా విభజించడం అన్యాయమన్నారు. 20ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఇప్పటికీ పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా కొనసాగించడం దారుణమన్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలోకి మార్చడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం సనాతన ధర్మం, గురువులను గౌరవించడం గురించి మాట్లాడుతుందని, అదే ప్రభుత్వం గురువులను రోడ్డుపైకి తీసుకువచ్చిందని విమర్శించారు. ప్రజలకు సేవ చేసే ప్రజాప్రతినిధులకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్న పాలకులు, విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ప్రజల కోసం త్యాగం చేయగలిగిన వారే పదవుల్లో ఉండాలని అన్నారు. పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల న్యాయమైన పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఉద్యోగులు ఐక్యంగా పోరాడితే పాలకుల పీఠాలు కదిలే పరిస్థితి వస్తుందని, సమాజం వారికి అండగా ఉంటుందని చెప్పారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరడం న్యాయమైన డిమాండ్ అన్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఈ ఉద్యమానికి వ్యవసాయ కార్మిక సంఘం పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ, తాత్కాలిక ఉపాధ్యాయులు, అధ్యాపకుల విషయంలో ఎపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హక్కులను పార్ట్‌టైమ్ ఉద్యోగులకు కల్పించడం లేదన్నారు. ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉద్యోగులతో పని చేయిస్తున్నారని ఆండ్ర మాల్యాద్రి తెలిపారు. గత నెల 28వ తేదీన మహాధర్నా ప్రారంభమైన తరువాత సొసైటీ కార్యదర్శి ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలిచి కొన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ హామీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పార్ట్‌టైమ్ టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందిని తక్షణమే కాంట్రాక్ట్ విధానంలోకి మార్చి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, దీర్ఘకాలిక సేవలను పరిగణనలోకి తీసుకొని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రసన్నకుమార్ మహాధర్నాకు మద్దతు తెలిపి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఆదివారం ప్రార్థనలు నిర్వహించారు. మహాధర్నాలో అసోసియేషన్ నాయకులు మున్నెల్లి గురురత్నం, మురగారెడ్డి, యేసోబు, ఇస్మాయేలు, జ్యోతి, చినబాబు, వర్మ, సునీత, గిరిజా, గోవిందు, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరరావు, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్