గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ నిర్బంధకాండ ఆపి.. బాధితులకు పరిహారం చెల్లించాలి

3 రోజుల క్రితం

lokanatam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 01:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖపట్నం ఎంవిపి కాలనీ ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయిన రైతులు, దళితులు, కార్మికులకు నష్ట పరిహారం చెల్లించాలని, వారి పక్షాన నిలుస్తున్న సిపిఎం, సిఐటియు నాయకులపై చద్రబాబు ప్రభుత్వం చేసే పోలీస్ నిర్బంధాన్ని నిలిపివేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం డిమాండ్ చేశారు. సిపిఎం ‌విశాఖ జిల్లా కార్యాలయం (ఏచూరి భవన్‌)లో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి పద్మతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్, తహశీల్దార్‌ ‌నెల రోజుల్లో సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని, కానీ, గడువు దాటినా పరిష్కారం చేయకపోగా గూగుల్ డేటా సెంటర్‌‌ పనులన్నీ జరిగిపోతున్నాయన్నారు. నిర్వాసితుల అంశాలపై ప్రస్తావిస్తున్న సిపిఎం నాయకులు డాక్టర్‌ ‌బి గంగారావు, ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తిని ఇప్పటికే నాలుగు సార్లు అరెస్ట్ చేశారని, వారేం తప్పు చేశారని ప్రశ్నించారు. జగ్గునాయుడు మాట్లాడుతూ ఈ నెల 16న తర్లువాడ గూగుల్ డేటా సెంటర్‌ ‌నిర్మాణ పనుల్లో మజ్జి అప్పలరాజు కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి వెళ్లి, శనివారం మరణించారని తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆ కుటుంబం, గ్రామస్తులు ఆందోళన చేస్తే వారిని వందలాది మంది పోలీసులు బయటకు నెట్టేసి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిహారం ప్రకటించకుండానే అంత్యక్రియలు జరిపించేశారని తెలిపారు. అప్పలరాజు మరణ వార్త తెలిసిన తర్వాత సిపిఎం, సిఐటియు భీమిలి జోన్ నాయకులు అక్కడికి వెళ్లడం కోసం ప్రయత్నిస్తే తర్లువాడకు వెళ్లే అన్ని మార్గాలనూ పోలీసులు దిగ్బంధం చేశారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి అప్పలరాజు కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ఆ కుటుంబంలోని పిల్లలకు విద్యా సౌకర్యం అందించాలని డిమాండ్‌ ‌చేశారు. డేటా సెంటర్‌ ‌బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్