- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బరావమ్మ
ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ : అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం మచిలీపట్నం బుట్టాయిపేట జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి అంగన్వాడీ వర్కర్ల విస్తృత సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేరనే సాకుతో కేంద్రాలను మూసివేయడం సరికాదన్నారు. మరోవైపు ప్రైవేటు ప్రీస్కూళ్లకు అనుమతులు ఇస్తూ అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. వైసిపి హయాంలో అంగన్వాడీలు 42 రోజులు నిర్వహించిన సమ్మె సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.11 వేల వేతనం పెరిగిన ధరల నేపథ్యంలో సరిపోవడం లేదని, అంగన్వాడీ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మహాత్మా గాంధీ చిత్రపటానికి సమర్పించారు. డిమాండ్ల సాధనలో భాగంగా అక్టోబర్ 6న మంత్రులకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి మూడు రోజుల పాటు ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కృష్ణాజిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అంగత రమాదేవి, కంచర్లపల్లి లక్ష్మి, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)