- జిఒ నెంబర్ 3 పునరుద్ధరించాలి
- 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి_
- సీతంపేట, ముంచింగిపుట్టులో ఆదివాసీల ఆందోళన
ప్రజాశక్తి-సీతంపేట, (పార్వతీపురం మన్యం జిల్లా), ముంచింగిపుట్టు (అల్లూరి జిల్లా)
_గిరిజన హక్కుల కు రక్షణ కల్పించాలని, జిఒ నెంబరు 3ను పున:రుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఆదివాసి గిరిజన సంఘం జెఎసి ఆధ్వర్యాన పార్వతీపురం మన్యం జిల్లా , అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనులు సోమవారం కదం తొక్కారు. పార్వతీపురం జిల్లా సీతంపేట, భామిని, గుమ్మలక్ష్మీపురం, మెలియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు, తదితర మండలాల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు సీతంపేట సంత మార్కెట్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా ఐటిడిఎ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ‘మన హక్కు.. మన భూమి.. మన ఉపాధి.. మన భవిష్యత్తు’ అనే నినాదాలతో హోరెత్తించారు. జిఒ నెంబర్ 3ని చట్టం అమలు ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఐటిడిఎ వద్ద ఆందోళన చేపట్టారు. గిరిజనుల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర_మాట్లాడుతూ 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో కలపాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు వి కళావతి, నిమ్మక జయరాజ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో లక్షా 23 వేల ఎకరాల భూములు గిరిజనేతరుల చేతుల్లో ఉన్నాయని తెలిపారు. జెఎసి అధ్యక్షులు బిడ్డిక శ్రీనివాస రావు మాట్లాడుతూ ఆదివాసీ భూములు ఉపాధి, విద్య హక్కులకు రక్షణ కల్పించాలని, 5వ షెడ్యూల్ ప్రాంత ఆదివాసులకు రాజ్యాంగ పరిరక్షణ పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున జిఒ నెంబర్ 3 పునరుద్దించేలా సిఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. జై భీమ్ అధ్యక్షులు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాను ప్రకటించకపోవడం వల్ల ఆదివాసీలు నష్టపోతున్నారన్నారు. ధర్నా వద్దకు వచ్చిన ఐటిడిఎ పిఒ పవర్ స్వప్నల్‌కు గిరిజనులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ కె ధర్మారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజాసంఘాలు, వివిధ రంగాల కార్మికసంఘాలు, ఆదివాసి గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, గిరిజన మహిళా సంఘం (ఐద్వా), నిరుద్యోగుల సంఘం, ఎస్ఎఫ్ఐతో పాటు మండలాల్లోని 23 పంచాయతీల గిరిజనులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ నుండి నాలుగు రోడ్ల కూడలి మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. సమీపంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. జిఒ3 కు ఆర్డినెన్స్ జారీ చేయాలని, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని నినదించారు. అనంతరం మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలదేవ్, ధర్మన్న పడాల్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గిరిజనులకే నూరు శాతం ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించే జిఒ 3ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో ఐటిడిఎల పరిధిలో నియామకాలు చేపడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు గిరిజనులకే పూర్తిగా వర్తించే విధంగా ప్రత్యామ్నాయ జిఒ తెస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.








కామెంట్‌లు (0)